రుయా ఆర్ఎంవోపై వేటు

తిరుప‌తి రుయాలో అంబులెన్స్ వాహ‌నాల డ్రైవ‌ర్ల దౌర్జ‌న్యం వ‌ల్ల మాన‌వ‌త్వం మంట‌గ‌లిసింది. అనారోగ్యంతో 9 ఏళ్ల కుమారుడు చ‌నిపోయి పుట్టెడు దుఃఖంలో తండ్రి వుంటే, క‌నీస మాన‌వ‌త్వం లేకుండా మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లానికి త‌ర‌లించ‌కుండా అడ్డుకోవ‌డంపై…

తిరుప‌తి రుయాలో అంబులెన్స్ వాహ‌నాల డ్రైవ‌ర్ల దౌర్జ‌న్యం వ‌ల్ల మాన‌వ‌త్వం మంట‌గ‌లిసింది. అనారోగ్యంతో 9 ఏళ్ల కుమారుడు చ‌నిపోయి పుట్టెడు దుఃఖంలో తండ్రి వుంటే, క‌నీస మాన‌వ‌త్వం లేకుండా మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లానికి త‌ర‌లించ‌కుండా అడ్డుకోవ‌డంపై నాగ‌రిక స‌మాజం సిగ్గుప‌డుతోంది. 

కుమారుడి శ‌వాన్ని భుజాన వేసుకుని, ద్విచ‌క్ర వాహ‌నంలో 90 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిట్వేలికి త‌ర‌లించే వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ఇంత‌కు ముందు క‌థ‌నంలో చెప్పుకున్న‌ట్టు ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది.

రుయా ఆర్ఎంవో పై క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. అలాగే రుయా సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ భార‌తికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇదే సంద‌ర్భంలో రుయాలో అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్స్ ధ‌ర‌లు నిర్ణ‌యించ‌డానికి ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, డీఎస్పీల నేతృత్వంలో ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేసింది.  

ఇదిలా వుండ‌గా రుయాలో అమాన‌వీయ ఘ‌ట‌న‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పందించారు. అంబులెన్స్‌ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని  విడదల రజిని తెలిపారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమన్నారు. మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తించిన వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. 

మ‌హాప్ర‌స్థానం అంబులెన్స్‌లు  24 గంట‌లూ ప‌నిచేసేలా త్వ‌ర‌లోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మృత‌దేహాల‌ను వీలైనంత‌ వ‌ర‌కు మ‌హాప్రస్థానం వాహ‌నాల ద్వారానే ఉచితంగా త‌ర‌లించేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.