కన్న తల్లి, సొంత చెల్లెలినే జగన్ మోసం చేశారంటూ టీడీపీ జనాలు, ఎల్లో మీడియా విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలకు సరిగ్గా ఎన్నికల ముందు చెక్ పెట్టాలని భావిస్తున్నారట జగన్. ఎన్నికల ప్రచారంలో మరోసారి అన్న కోసం చెల్లెలు షర్మిల ఏపీ లోని కీలక ప్రాంతాల్లో పర్యటించబోతున్నారట.
ఈ విషయంపై రేపు జరగనున్న కీలక సమావేశంలో జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు చాలామంది. మరికొందరు మాత్రం జగన్-షర్మిల చుట్టూ ఎల్లో మీడియా చేస్తున్న కామెంట్లను అలానే కొనసాగేలా చేసి, సరిగ్గా ఎన్నికల ముందు జగన్ ఈ అంశంపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు.
రేపు జరగబోయే మీటింగ్ లో చాలా విషయాలపై నాయకులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఇన్ చార్జ్ లకు జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అందులో షర్మిల అంశం కూడా ఉంది. ఇటీవల విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా జగన్ ట్వీట్ వేయలేదని, ఆయన ప్రకటన విడుదల చేయలేదని కూడా రాద్ధాంతం జరిగింది. అందులోనూ అమ్మ, చెల్లితో ఇటీవల జగన్ కి గ్యాప్ పెరిగిందని కూడా ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది.
వీటన్నిటినీ అడ్డుకోవాలంటే జగన్ నోరు విప్పాలి. అటు నాయకులు కూడా ఆయా అంశాలు ప్రస్తావనకు వస్తే నోరు మెదపలేని పరిస్థితి. సజ్జల వంటి వారు కూడా సమస్య మొదలయ్యే సమయంలో మాట్లాడారు కానీ, ఇప్పుడు పూర్తిగా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.
ఈ దశలో అసలు జగన్ మనసులో ఏముంది, వైరి వర్గాలు విజయమ్మ, షర్మిల పేరుతో చేసే విమర్శలకు ఎలా బదులివ్వాలి..? బ్రదర్ అనిల్ పేరుతో పార్టీ అనే హడావిడి జరుగుతోంది.. దాన్నిఎలా తిప్పికొట్టాలనే విషయంలో కూడా వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై జగన్ నేతలకు ఓ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
జగన్ వెంటే షర్మిల..
ఆమధ్య తెలంగాణ పర్యటనల్లో షర్మిల.. ఆ రాష్ట్రంలో పరిస్థితి నన్నెందుకు అడుగుతారంటూ మీడియాకి చురకలంటించారు. అంతకంటే ముందు ఆమె జగన్ పాలనను మెచ్చుకున్నారు కూడా. ఏపీలో రాజన్న రాజ్యం నడుస్తోందన్నారు. అందుకే ఏపీలో తను పార్టీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు కాబట్టి పార్టీ పెట్టానన్నారు.
తాజాగా కేటీఆర్ చేసిన విమర్శలకు స్పందిస్తూ.. ఘాటుగా జవాబిచ్చారు షర్మిల. అత్త మీద కోసం దుత్తమీద చూపించడం తనకు చేతకాదన్నారు. జగన్ మీద కోపంతో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారనే కేటీఆర్ విమర్శల్ని తిప్పికొట్టారు. జగన్ పై కోపం ఉంటే ఏపీలోనే పార్టీ పెట్టేదాన్నని క్లారిటీ ఇచ్చారు,
అయితే ఎల్లో మీడియా మాత్రం ఎప్పుడూ జగన్-షర్మిల మధ్య విభేధాలు సృష్టించడానికే ప్రయత్నించింది. గతంలో జగన్ తరపున ప్రచారం చేసిన షర్మిల, కనీసం ఇప్పుడు ఆయన పాలన గురించి కూడా మాట్లాడటం లేదంటోంది. ఈ విమర్శలకు జవాబుగా.. నేరుగా షర్మిలనే రంగంలోకి దింపాలనుకుంటున్నారట జగన్.
ఏపీలో ఎన్నికలకు ఏడాది ముందుగానే తెలంగాణలో ఎన్నికలు పూర్తవుతాయి. అంటే అప్పటికే షర్మిలకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఇక ఆ తర్వాత పూర్తిగా అన్న జగన్ కి మద్దతివ్వడానికి షర్మిల, తన సమయాన్ని కేటాయించే అవకాశాలున్నాయి. సో.. ఎల్లో బ్యాచ్ నోటికి తాళం వేయడానికి జగనన్న వదిలిన బాణం మరోసారి ప్రత్యర్థులకు చుక్కలు చూపెట్టే అవకాశాలున్నాయి.