ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ బీజేపీ కోసం చేయబోతున్నారంటూ పరోక్షంగా కామెంట్ చేశారు కేటీఆర్. ఎన్నికల సమయంలో యూరి లాంటి సినిమాలు, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వస్తాయని, రేపు అయోధ్య రామాలయం ప్రారంభానికి కాస్త అటు ఇటుగా ఆదిపురుష్ వదులుతారని చెప్పారు. అలా ఆదిపురుష్ వెనక బీజేపీ హస్తం ఉందని పరోక్షంగా చురకలంటించారు కేటీఆర్.
ఆదిపురుష్ అనేది కేవలం పురాణ కథ అయితే కేటీఆర్ వ్యాఖ్యల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ అది ప్రభాస్ మూవీ. ఆయన తొలిసారిగా బాలీవుడ్ దర్శకుడితో కలిసి చేస్తున్న మూవీ. తన కెరీర్ లోనే తొలిసారిగాల రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న డివోషనల్ మూవీ ఇది. ఇంత స్పెషాలిటీ ఉన్న సినిమాని బీజేపీ స్పాన్సర్ చేసిందనే విషయాన్ని కేటీఆర్ ఎందుకు హైలెట్ చేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇస్తున్న కేటీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో కొత్తగా వస్తున్న ట్రెండ్స్, సోషల్ మీడియా ప్రచారం, ట్రోల్స్, మీమ్స్ పై కూడా తన మనసులో మాట బయటపెట్టారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని బీజేపీ ఎలా వాడుకుంటుందనే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టారు. అకస్మాత్తుగా ప్రజల్లో దేశభక్తి అనే భావన పెరిగిపోడానికి, బీజేపీకి జై కొట్టడానికి, బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచిందనే భావన ప్రజల్లో తేవడానికి ఆ పార్టీ సినిమాలను ఉపయోగించుకుంటుందనేది కేటీఆర్ వాదన.
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాంటివాళ్లు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, ఆయన చేసిన సినిమాల్లో కొన్ని బీజేపీ ప్రమోషన్ కోసం తీసినవేనని చెప్పారు. యూరి, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాల విషయంలో అంతర్లీనంగా ఉన్న పాయింట్ ని ఆయన సున్నితంగా విమర్శించారు. అదే పంథాలో అయోధ్య రామమందిరాన్ని కూడా బీజేపీ తమ రాజకీయాలకు వాడుకుంటుందనేది కేటీఆర్ వాదన.
రామమందిరం లాగే రాముడు అనే సబ్జెక్ట్ ని, దాని ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్ సినిమాని కూడా బీజేపీ వదిలిపెట్టదని, అసలు ఆ సినిమా కూడా అదే స్ట్రాటజీతో తెరకెక్కిందని చెప్పారు. రామమందిరం ప్రారంభోత్సవానికి ఆదిపురుష్ రిలీజవుతుందని, అది బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ అని విమర్శించారు.
అయితే ప్రభాస్ ని ఎక్కడా బ్లేమ్ చేయాలనుకోలేదు కేటీఆర్. మరి ప్రభాస్ తెలివి తక్కువగా బీజేపీ బుట్టలో పడ్డాడా.. లేక తెలిసే ఆ పనిచేశాడా లేక వంద కోట్ల పారితోషికం కోసం ఒప్పుకున్నాడా అనేది తేలాల్సి ఉంది.