కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో నేడో, రేపో ప్రశాంత్ కిషోర్ చేరుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కాంగ్రెస్‌లో పీకే చేరికపై ఏడుగురితో కూడిన కమిటీని పార్టీ నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి కాంగ్రెస్‌లో పీకేను చేర్చుకోవాలని అధిష్టానానికి నివేదిక సమర్పించింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే అంశాలపై ప్రశాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీకేని వ్యూహకర్తగా టీఆర్ఎస్ నియమించు కుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విజయానికి సలహాలు, సూచనలు ఇస్తున్న పీకే… తెలంగాణకు వచ్చే సరికి టీఆర్ఎస్ గెలుపునకు ఏ విధంగా పని చేస్తారనే ప్రశ్నలొచ్చాయి.
టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి జాతీయ స్థాయిలో పని చేయడానికి పీకే మధ్యవర్తిగా పనిచేస్తున్నారని భారతీయ జనతాపార్టీ విమర్శల దాడి మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్ సూర్జేవాలా కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించినట్టు ఆ ట్వీట్ సారాంశం. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆయన పేర్కొనడం విశేషం.