విద్య అంటే ఎపుడూ తరగని ఆస్తిగానే చూడాలి. విద్యను పంచితే అది తరతరాలకు వెలుగు ఇస్తూనే ఉంటుంది. అలాంటిది అద్భుతం ఒకటి విశాఖలో వందేళ్ళకు పూర్వం జరిగింది. విశాఖలో ప్రతిష్టాత్మకైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడి ఇప్పటికి అచ్చంగా 96 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 97 ఏట అడుగుపెట్టి అలా అపతిహతంగా తన ప్రస్థానాన్ని సాగిస్తోంది.
సరిగ్గా ఇదే రోజున 1926 ఏప్రిల్ 26న ఏయూని విశాఖలో ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటు వెనక ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి చేసిన పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. నాటి బ్రిటిష్ పాలకులతో ఆయన గట్టిగా ఉద్యమించి మరీ ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం తీసుకువచ్చారు.
అలా ఆయన వ్యవస్థాపక ఉప కులపతిగా మొదలైన ఏయూ ప్రస్థానం మరో మూడు అడుగులలో నూరేళ్ల పండుగకు చేరువగా ఉంది. దేశానికి తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ వంటి విద్యావేత్తలు ఏయూకు ఊపిరి పోశారు. ఎందరో ప్రముఖులు మరెందరో మేధావులు ఏయూని కీర్తి శిఖరాల మీద నిలబెట్టారు.
తొందరలో నూరేళ్ల పండుగ చేసుకోబోతున్న ఏయూ ఈ రోజుకూ అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తూ విద్యా రంగంలో వినూత్నమైన సంస్కరణలను తీసుకువస్తూ ముందుకు సాగుతోంది.
ఏయూ ద్వారా చదువుకున్న ఎందరో విద్యార్ధులు తరువాత కాలంలో దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి చేరుకున్నారు. మొత్తానికి ఏయూ నూరేళ్ళ పండుగకు అంతా వేచి చూస్తున్న శుభ తరుణమిది.