ఆమంచి కృష్ణమోహన్ అనే మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన లో చేరారు. అధికార పార్టీ నుంచి ఒక స్థాయి నాయకుడు వచ్చి ప్రత్యర్థి పార్టీలో చేరడం అంటే కచ్చితంగా అది వారికి కొంత ఆత్మవిశ్వాసాన్ని అందించే అంశం. ఆ విషయం ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఆమంచి స్వాములు రాకతో మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ మాటలలో జనసేన పార్టీకి ఉన్న నాయకత్వ దారిద్ర్యం కూడా వెల్లడవుతోంది.
ఆమంచి కృష్ణమోహన్ అంటే ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు అయినప్పటికీ ఆయన ప్రాబల్యం చీరాల నియోజకవర్గానికే పరిమితం. కరణం బలరాం చీరాల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆమంచి- కరణం వర్గాల మధ్య నిత్యం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇరువురు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమం నిర్వహించడానికి పోటీలు పడుతూ, రోడ్డున పడి కొట్టుకుంటూ నానా గందరగోళం సృష్టిస్తూ వచ్చారు.
చీరాల నియోజకవర్గానికి బలరాం కొడుకు కరణం వెంకటేష్ ను ఇన్చార్జిగా నియమించిన వైఎస్ జగన్, ఆమంచి కృష్ణమోహన్ ను పరుచూరి ఇన్చార్జిగా నియమించి చీరాలలో ముఠా కక్షలకు తెరదించారు. అయితే అక్కడ పార్టీ చీలిపోతుందని ఆయన ఊహించినట్లు లేదు.
ఆమంచి కృష్ణమోహన్ సోదరుడిగా ఆమంచి రాములు పాత్ర ఇన్నాళ్లూ చీరాల నియోజకవర్గానికే పరిమితం. ఆయన వచ్చి జనసేనలో చేరిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆనందాన్ని గమనిస్తే చాలా చిత్రంగా అనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడైన ఆమంచి రాములు రాక వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ సెలవివ్వడం ఆశ్చర్యకరం.
ఇప్పుడు రాములు రాకతో ఇంత ఆశలు పెట్టుకుంటున్నారంటే.. తొమ్మిదేళ్లుగా ఈ మూడు జిల్లాలలో పార్టీ బలోపేతం దిశగా వాళ్ళు సాధించింది ఏమిటి? అనే అనుమానం కలుగుతుంది. చీరాల నాయకుడు పార్టీలోకి వచ్చేదాకా గుంటూరు, కృష్ణాజిల్లాలలో కూడా జనసేన ను బలోపేతం చేసే దిక్కు లేకుండా ఉన్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది.
పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు ఆమంచి కృష్ణమోహన్ రాములు మీద కనపరుస్తున్న నమ్మకం గమనిస్తే జనసేన పార్టీ ఎంతటి నాయకత్వ దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నదా అని పలువురు భావిస్తున్నారు!