ఉన్నపళంగా ఇప్పుడు ఎన్నికలు వస్తే కనుక ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఇది ఆ పార్టీ కార్యకర్తలకు చిక్కు ప్రశ్నే. నిజానికి ఆ పార్టీకి ఇక్కడ సరైన అభ్యర్థి లేరు. తెలుగుదేశం తరఫున గెలిచిన కరణం బలరాం వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరిన తర్వాత నాయకత్వలేమి తెలుగుదేశాన్ని బాధించింది. కొండయ్యను పార్టీ ఇన్చార్జిగా నియమించారు. అయితే ఎన్నికల సమరంలోకి ఆయన మీద నమ్మకంతో దిగుతారని గ్యారెంటీ లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు తెలుగుదేశానికి కాస్త కలిసి వచ్చాయి. ఆ నియోజకవర్గాన్ని జనసేనకు పొత్తుల్లో భాగంగా వదులుకోబోతున్నట్లుగా ప్రస్తుతం సంకేతాలు అందుతున్నాయి.
చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమంచి రాములు జనసేన పార్టీలో చేరడం ఇలాంటి అభిప్రాయం కలిగిస్తోంది. జనసేన నుంచి ఎమ్మెల్యే టికెట్ గురించి ఎలాంటి హామీ లేకుండా.. రాములు పవన్ కల్యాణ్ పంచన చేరి ఉంటారని అనుకోవడం భ్రమ.
అక్కడి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రాములు సోదరుడు. కృష్ణమోహన్ తరఫు సగం రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్కబెడుతూ ఉండేవారు. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్- కరణం బలరాం వర్గాల మధ్య కుమ్ములాటలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. వీరి తగాదాలకు పరిష్కారం అన్నట్లుగా కృష్ణమోహన్ ను పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే దాని వలన చీరాల నియోజకవర్గంలోని ఆమంచి గ్రూపు నాయకుల్లో అసంతృప్తి చల్లారినట్లు లేదు. ఆ ఫలితంగానే ఇప్పుడు ఆమంచి రాములు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎటూ తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న చీరాల నియోజకవర్గంలో వైసిపి నేతను తమతో చేర్చుకోవడం ద్వారా జనసేన అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కర్చీఫ్ వేసినట్లు అయింది. ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా జనసేన డిమాండ్ చేసినా సరే ఇవ్వడానికి తెలుగుదేశానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి గతి లేని నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ తాను అడగడానికి ఏరి మరీ ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఆయన పల్లకీ మోస్తున్న పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపులో కూడా చంద్రబాబుకు ఎలాంటి తలనొప్పి లేకుండా చూస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశానికి ఠికానాలేని నియోజకవర్గాలను మాత్రమే పొత్తుల్లో భాగంగా అడిగి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.