‘ముని’వాక్యం: రీలు కాదు.. నకిలీలు కాదు!

రెండు కథలు చెప్పుకోవాలి..  Advertisement ఒకటో కథ- ‘ఇన్‌స్పెక్టర్ వెంకట్ ఎక్కడ?’ అంటాడో పోలీసు అధికారి. కట్ చేస్తే- జీపులో యూనిఫాంలో వెంకటేష్ వెళుతూ ఉండగా, రోడ్డు పక్కన ఒక దొంగ సూట్ కేసు…

రెండు కథలు చెప్పుకోవాలి.. 

ఒకటో కథ-

‘ఇన్‌స్పెక్టర్ వెంకట్ ఎక్కడ?’ అంటాడో పోలీసు అధికారి. కట్ చేస్తే- జీపులో యూనిఫాంలో వెంకటేష్ వెళుతూ ఉండగా, రోడ్డు పక్కన ఒక దొంగ సూట్ కేసు తస్కరించి పారిపోతుంటాడు. అంతే.. చేజ్ సీన్! ఇరుకైన గల్లీలు, జనసమ్మర్దంగా ఉండే సందుల్లో స్టడీకామ్ కెమెరా తరుముతుండగా ఇద్దరూ పరుగులు తీస్తారు. తీరా ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఆ దొంగకు నాలుగు తగిలించి.. సదరు సూట్ కేసు పోగొట్టుకున్న ఆసామీని, స్టేషనుకు వచ్చి కంప్లయింటు రాసిచ్చి, సూట్ కేసు తీసుకెళ్లమని పురమాయించి, జీపెక్కి చక్కా వెళ్లిపోతాడు. అప్పుడు మళ్లీ కట్ చేస్తే.. అంతసేపు జరిగిన చేజింగ్ ఒక నాటకం అని, ఇన్‌స్పెక్టరుగా వెంకటేష్ ది వేషం మాత్రమేనని మనకు తెలుస్తుంది. రాంగోపాల్ వర్మ ‘సినిమా’ను ప్రేమించే రోజుల్లో చేసిన క్షణక్షణంలోనిది ఈ సన్నివేశం! అలాంటి నకిలీ పోలీసు వేషాలు మనకు కొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి.

ఊరిచివర రోడ్డు పక్కన నిల్చున్న పోలీసులు, వాహనాల్ని ఆపి జరిమానాలు వసూలు చేయడం.. ఐటీ అధికారులం అని చెప్పి సంపన్నుల ఇళ్లలో తనిఖీలకు వెళ్లి దొరికినంత సొమ్ముతో ఉడాయించడం వంటి చిన్నా పెద్ద నకిలీ ఖాకీల వేషాలు మనం నిత్యం వార్తల్లో అనేకం చూస్తుంటాం. సినిమాల్లో అయితే లెక్కేలేదు. నకిలీలు- సినిమాల్లో చూసి సమాజంలో తయారవుతున్నారా? సమాజంలో చూసి సినిమాల్లో పెడుతున్నారా? అనేది అరిస్టాటిల్ కు ఎదురైన కోడిముందా? గుడ్డు ముందా? లాంటి పురాతన ప్రశ్న. 

రెండో కథ-

ఒక నిరుపేద కుర్రాడు. పేదరాలైన తల్లి. తిండికి కూడా గతిలేదు. కడుపు నిండాలంటే ముష్టెత్తుకోవడం ఒక్కటే మార్గం. తల్లి ఒక వీధిలో, తను ఒక వీధిలో భిక్షాటన చేసేవాడు. తనేమో ఎవరో ధర్మం చేసిన కాళ్లదాకా వేళ్లాడే చిరుగుల చొక్కాలు వేసుకుని ముష్టెత్తుతూ ఉంటాడు. శుభ్రమైన దుస్తుల్లో చేతుల్లో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లే పిల్లల్ని రోడ్డు పక్కన నిల్చుని ఆశగా చూస్తూ ఉండేవాడు. ఆ పసి హృదయానికి తెలియకుండానే, తాను కూడా చదువుకోవాలనే ఒక కోరిక. 

బడి వాకిట నిల్చుంటే.. ముష్టివాడనుకుని అవతలికి పొమ్మని అందరూ ఈసడించుకున్న రోజులు! ఆ పిల్లాడి బాధను గమనించి.. తల్లి బడిలో చేరిస్తే.. కొన్ని రోజుల పాటూ అతడిని తమతో కూర్చోనివ్వని సహ విద్యార్థులు. ఒకవైపు చదువుకుంటూ కడుపు నింపుకోవడం కోసం కూలి పనులు.. పెళ్లిళ్లలో ఎంగిళ్లు తీయడం దగ్గరినుంచి, శవాన్ని పాతిపెట్టడానికి గోతిని తవ్వడం వరకూ.. అన్ని రకాలు పనులు. కట్ చేస్తే- ఒక పెద్ద పోలీసు ఆఫీసరు. ‘బిచ్చగాడు-3’ సినిమా కోసం తయారుఅవుతున్న స్క్రిప్టు కాదిది. ఇలాంటి కథలు కూడా మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. నిజజీవితంలోనూ కొన్ని తారసపడుతుంటాయి.

సేమ్ టూ సేమ్.. అరిస్టాటిల్ తర్వాత.. కోడి, గుడ్డు ఏదిముందో నని మహా మధన పడిన గ్రీకు తత్వవేత్త, సూర్యుడి (అపోలో) గుడిపూజారి ప్లుటార్చ్ ఆవేదన లాగానే స్పష్టంగా చెప్పలేం.

కథలుగా చెప్పుకున్నాం గానీ.. ఇవి కథలు కాదు. ఒక కాడకు పూసిన రెండు పువ్వుల్లాగా, ఒక పండు ముక్కలలో రెండు రుచులలాగా ఆంధ్రప్రదేశ్ ఖాకీవనంలో మొలిచిన రెండు మొక్కలు. ఒకటి గంజాయి మొక్క అనుకుంటే.. రెండోది తులసి అనుకుందాం.

ఈ అధికారులు నకిలీ అధికారులు కాదు.. వార్తల్లోకి వచ్చిన వారి చేతలు నకిలీవి కాదు. విశాఖపట్టణంలో స్వర్ణలత అనే సీఐ రెండువేల నోట్ల మార్పిడి వ్యవహారంలో తన అనుచర పోలీసుగణాన్ని వెంటబెట్టుకుని, వారి ఆసరా తీసుకుని సాగించిన దందా ఇవాళ రాష్ట్రమంతా సంచలన చర్చనీయాంశం. స్వర్ణలత కు తన అందం మీద అపారమైన నమ్మకం. పోలీసు శాఖలో తన అందం అడవి కాచిన వెన్నెల అవుతోందనే చింత కొంత! అప్పటికీ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ.. సదరు వీడియోలను ప్రచారంలో పెడుతూ ఔత్సాహిక కళాకుశలతకు పదును పెట్టుకుంటూనే వచ్చారు. 

కానీ అందమైనా సరే, కళాకౌశలమైనా సరే నిజమైన రాణింపును దక్కించుకోవడం అంటే తెరువు ఏది? సినిమా ఒక్కటే నన్నది ఆమె ప్రగాఢ నమ్మిక! అందుకే ‘ఏపీ 31’ అనే కర్తవ్యం రేంజి కాకపోయినా.. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాతో తెరంగేట్రానికి సిద్ధమయ్యారు. పోస్టరుపై సోలోగా మెరుస్తున్నారు గనుక.. ఆమె హీరోయిన్ అని అనుకున్నారంతా! కానీ.. ‘పింక్ దందా’ బయటకు వచ్చిన తర్వాత, ఆమెది కేవలం గెస్ట్ రోల్ మాత్రమేనని ప్రకటించి సినిమా మేకర్స్ చేతులు దులుపుకున్నారు.

ఇంతకూ సదరు పింక్ దందా ఏమిటి? రెండు వేల నోట్ల రూపాయలను మార్చుకోవడానికి నల్ల కుబేరులు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. అందులో విశాఖ నేవీ అధికారులకు సంబంధించిన ఒక వ్యవహారం 90 లక్షలకు ఒక కోటి మార్పిడి జరిగేలా ఒక డీల్ నడిచింది. స్వర్ణలత స్వయంగా ఆ డీల్ ను తెరవెనుక నుంచి నడిపించి హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి డబ్బు కాజేశారా? అనుకోకుండా ఆ జాక్ పాట్ తగిలిందా? అనే విషయంలో క్లారిటీ లేదు. కాకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అరెస్టు అయ్యారు. ఇంతకూ ఆమె నకిలీ సీఐ కాదు, ఖాకీ దుస్తుల వేషమూ వేసుకోలేదు. నిజం సీఐనే. సినిమా షూటింగుకోసం చేసిన దందా కాదు. సాగించినది నిజం దందానే!

ఖాకీవనంలో గంజాయి మొక్కలు కొత్త కాదు. దొరికిన వారి గురించే చర్చ నడుస్తుంటుంది. దొరకని గంజాయి మొక్కలు అనేకం. అయితే, తాజాగా దొరికిన ఈ గంజాయి మొక్క చుట్టూ తులసి కోట నిర్మించడానికి.. పసుపు కుంకుమలు పెట్టి పూజాదికాలు నిర్వహింపజేయడానికి రాజకీయ ప్రముఖులు చక్రం తిప్పుతుండడం అసలు కీలకం. దర్యాప్తులో ఆమె నోరు మెదపకపోయినా.. ఉన్నతాధికారులు నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తుండడం కొసమెరుపు.

ఒకటో కథతోనే అంతా అయిపోలేదు. రెండో కథ కూడా చర్చించాల్సినదే. అనంతపురంలో హనుమంతు అనే ఏఆర్ ఏఎస్‌పి ఉన్నారు. ఈ మధ్య ఒక పాఠశాలలో కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులకు స్ఫూర్తినివ్వడానికి తన జీవిత భాగాన్నే వారి ముందు ఆవిష్కరించారు. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన రెండో కథను మళ్లీ ఓసారి చదువుకుంటే అదే ఆ హనుమంతు జీవితం! అంతటి కటిక పేదరికం నుంచి పుట్టిన పట్టుదల ఆయనను పోలీసు ఉన్నతాధికారిని చేసింది. ఒక స్థాయికి వెళ్లిన తర్వాత.. తమ బతుకుల్లో చీకటి కోణాలను మరింత అగాథాల్లోకి తొక్కేసి.. మెరుగు బతుకులను మాత్రమే ప్రదర్శించుకుంటూ జీవించేవారు అనేకులు మనకు తారసిల్లుతారు. 

కానీ హనుమంతు అలా కాదు. తన పసితనపు దారిద్ర్యాన్ని చాలా సరళంగా, పిల్లల ఎదుట నిజాయితీగా ఆవిష్కరించారు. ఇతరత్రా విషయాలను పక్కన పెడితే.. పిల్లల ముందు మాట్లాడిన తీరు చూసి.. బిచ్చమెత్తుకునే తనను బడిలోకి అనుమతించిన తొలిటీచరు రమణాచారిని గుర్తుంచుకుని ప్రస్తావించిన ఆయన భక్తి చూసి..  ఖాకీవనంలో పుట్టిన తులసిమొక్క అనుకోవాల్సిందే. తన బతుకు నేపథ్యం- పిల్లలకు స్ఫూర్తి నివ్వడానికి మాత్రమే కాకుండా.. ఆయన పనితీరును, పేదల కష్టాల పట్ల ప్రతిస్పందనలను, వృత్తిలో నిజాయితీని నిత్యం ప్రభావితం చేస్తూ ఉండగలిగితే.. నిత్య వ్యవహారంలో ఆయన స్మరణలో ఉండగలిగితే చాలా సంతోషం. 

కానీ గంజాయి మొక్క సంగతేమిటి? నోట్ల మార్పిడి దందాను నడిపించినది ఒక నాయిక అయితే.. స్వయంగా వ్యభిచార గృహాలను నిర్వహింపజేస్తూ.. దొంగతనాలకు దన్నుగా ఉంటూ.. హత్యలకు సూత్రధారులుగా చెలామణీ అవుతూ చెలరేగుతున్న వారు లేరా? ఖాకీ వనం అంటే.. సామాన్యుడి రక్షణకు, భద్రతకు ఉద్దేశించిన కవచం, కంచె! కవచం బీటలు వారిపోతే, కంచె కుంచించుకుపోతూ ఉంటే.. పర్యసానాలు ఎలా ఉంటాయి. సమాజం రుజుమార్గంలోనే ఉంటుందా? వక్రతలోని మజాను రుచి చూడగలిగిన వారంతా.. ఈ ఖాకీవనపు గంజాయి మొక్కల నీడలో చెలరేగితే మిగిలిన సమాజం ఏమవుతుంది? ఇవన్నీ సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు!! విచారం కలిగించే ప్రశ్నలు.

..కె.ఎ.మునిసురేష్ పిళ్లె 

[email protected]