తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ సీఐ అంజూయాదవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తమ కార్యకర్త కొట్టే సాయి రెండు చెంపలు చెళ్లుమనిపించడంపై జనసేనాని పవన్‌కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సీఐ వైఖరిపై ఆయన మండిపడ్డారు. సీఐపై చర్యల కోసం విన్నవించేందుకు స్వయంగా ఆయనే సోమవారం తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.
అయితే తిరుపతికి పవన్‌కల్యాణ్ వెళ్లి హంగామా చేయడానికి ముందే, సీఐపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో డీజీపీ ఉన్నట్టు సమాచారం. జనసేన కార్యకర్త సాయిని కొట్టడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ రోజు అసలేం జరిగిందో ఎస్పీ పరమేశ్వరరెడ్డి సమగ్ర నివేదికను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డికి పంపారు. అంతేకాకుండా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కిందిస్థాయి మొదలుకుని డీజీపీ వరకూ నోటీసులు ఇచ్చింది.
సీఐపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ నెల 27వ తేదీలోపు తెలియజేయాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. దీంతో సీఐపై చర్యలు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి తలెత్తింది. రాజకీయంగా నష్ట నివారణ చర్యలను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తోంది.
జనసేన కార్యకర్తపై బహిరంగంగా చేయి చేసుకోవడంతో సమర్థించుకోడానికి వీల్లేకుండా పోయిందని పోలీస్ అధికారులు అంటున్నారు. పవన్‌కల్యాణ్ సోమవారం తిరుపతికి వస్తుండగా, అంతకు ముందే సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటన వెలువడే అవకాశం వుంది.