గ్రౌండ్ రియాల్టీ తెలియని రాతలు

నోరా.. వీపుకు తేకే అన్నది సామెత. అంటే నోటితో ఎవర్నయినా తిడితే వీపు మీద రెండు దెబ్బలు పడతాయి అన్నది అర్థం. ఇప్పుడు దాన్ని నోరా.. ఓట్లకు చేటు తేకే అని మార్చుకోవాలేమో?  ఏ…

నోరా.. వీపుకు తేకే అన్నది సామెత. అంటే నోటితో ఎవర్నయినా తిడితే వీపు మీద రెండు దెబ్బలు పడతాయి అన్నది అర్థం. ఇప్పుడు దాన్ని నోరా.. ఓట్లకు చేటు తేకే అని మార్చుకోవాలేమో?  ఏ వారానికి ఆ వారం రాజకీయ పరిస్థితిని విశ్లేషించే జర్నలిస్ట్ ఆర్కే ఈవారం ఇలాంటి పరిస్థితి మీదే తన కలం ఎక్కుపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, ఆంధ్రలో జనసేన నేత పవన్ కళ్యాణ్ నోరు జారి తెచ్చుకున్న ఇబ్బందులను ప్రస్తావించారు.

వలంటీర్ల వ్యవస్థ తేనెతుట్టను పవన్ కదిపారు. అది కొంత వరకు ప్రజలకు ఉపయోగపడుతోంది అని అంటూనే, ఆ వ్యవస్థ ను విమర్శించే పని ప్రారంభించారు. ఎలాగూ వ్రతం చెడింది. కనుక ఏదో కిందా మీదా పడి ప్రతిపక్ష స్టాండ్ నే డిఫెండ్ చేసే ప్రయత్నం చేసారు ఆర్కే కూడా. కానీ ప్రతిపక్షాలు చెప్పిన మాటలే తానూ చెబితే ఎలా..సమ్ థింగ్ యాడ్ చేయాలి కదా. అందుకే అసలు ఈ వలంటీర్ వ్యవస్థ వల్ల వైకాపా నేతలే బాధపడుతున్నారని, అసంతృప్తిగా వున్నారని, జగన్ ప్రజలతో నేరుగా ఈ వ్యవస్థతో కనెక్షన్ పెట్టేసుకుని, లోకల్ లీడర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రమేయం లేకుండా చేసుకువచ్చారని రాసుకొచ్చారు.

అసలు ఆర్కేకు కానీ పంచాయతీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్న పవన్ కు కానీ గ్రౌండ్ రియాల్టీ తెలుసా అన్నది ఓ అనుమానం.

మన రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఎప్పుడూ బలంగా లేదు. కేవలం మేజర్ పంచాయతీలకే కాస్త కార్యాలయాలు, పంచాయతీ సెక్రటరీ, మీటింగ్ లు, కోరమ్, ఇలా పద్దతులు వుంటూ వచ్చాయి. మైనర్ పంచాయతీలు పేరుకే పంచాయతీలు. వీటికి వంతుల వారీగా రిజర్వేషన్ అమలు చేసే వరకు ఏదో ఒక కుటుంబం కిందే వుండేవి. లేదా గ్రామ పెద్దలు తమ బినామీలను పెట్టి నడిపించేవారు. మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఓ సెక్రటరీ వుండేవారు. ఆయనకు బుద్ది పుట్టినపుడు వచ్చి, రికార్డులు రాసుకుని వెళ్లిపోయేవారు.

ఎన్టీఆర్ మండలాలు ఏర్పాటు చేసిన తరువాత పరిస్థితి కొంత వరకు మారింది. జనాలకు పంచాయతీ, మండలాలు, ఎమ్మార్వో, ఆర్ఐ ఇలా ఓ అధికారిక పాట్రన్ అంటూ వుంటుందని తెలిసి వచ్చింది. అంతకు ముందు సమతిలు వుండే కాలంలో అసలు అవి ఎక్కడ వుంటాయో కూడా తెలిసేది కాదు. తొంభై శాతం పంచాయతీలకు నాలుగేళ్ల క్రితం వరకు కార్యాలయాలే లేవు.

ఇప్పుడు జగన్ వచ్చిన తరువాత పాట్రన్ ఎలా మారిందో చూద్దాం.

గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు వచ్చాయి. అని మార్నింగ్ టు ఈవెనింగ్ పక్కాగా పని చేస్తున్నాయి. బయోమెట్రిక్ సిస్టమ్ లో హాజరు వేయాల్సి వుంది.

ఈ సచివాలయంలోనే పంచాయతీ సర్పంచ్ కు ఓ గది కేటాయించారు. పంచాయతీ సెక్రటరీకి మరో గది వుంటోంది. వీఆర్వో కూడా ఇదే చోట వుండాల్సిందే. వీరు కాక కొంత మంది సిబ్బంది, సర్వేయర్ కూడా వుంటున్నారు. ఇదీ సెటప్.

ఇక ఎమ్మెల్యేలకు, సర్పంచ్ లకు ప్రమేయం లేదు అన్న పాయింట్ కు వద్దాం. అసలు వలంటీర్లను ఎవరు ఎంపిక చేసారు. ఎవరు సిఫార్సు చేసారు. వలంటీర్ వ్యవస్థ ను ప్రకటించిన తరువాత ఎమ్మెల్యేలే లోకల్ వైకాపా లీడర్లకు చెప్పారు. వాళ్లు జాబితాలు రెడీ చేసారు. ఇది వాస్తవం. ఒప్పుకోవాల్సిందే. ఎన్ని పార్టీలు వున్నా లోకల్ గా అందరూ.. బావా.. మావా.. అన్నయ్యా అనుకోవడమే. అందువల్ల ఒకరిద్దరు ఇతర పార్టీ వాళ్లకు కూడా అవకాశాలు దొరికాయి.

ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం, పథకాలు అవీ పేరుకు వలంటీర్లు ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నా అదంతా లోకల్ లీడర్ల కనుసన్నలలోనే జరుగుతోంది. లోకల్ లీడర్లు, సర్పంచ్ లు, మండల నాయకులు, ఎమ్మెల్యేలు ఈ సెటప్ యాజ్ ఇట్ ఈజ్ గా వుంది. ఎటొచ్చీ ఆర్కేకు ఈ గ్రౌండ్ రియాల్టీ తెలిసి వుండకపోవచ్చు. అన్నీ పార్టీ పద్దతుల ప్రకారమే జరుగుతోంది.

అలా జరుగుతోంది కనుకే బాబు గారి డైరక్షన్ లో పవన్ వలంటీర్లను టార్గెట్ చేసింది. ఆర్కే చెప్పినట్లు వలంటీర్ల వల్ల వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా వుంటే అస్సలు టార్గెట్ చేయనక్కరలేదు. ఎందుకంటే కాగలకార్యం వాళ్లే చూసుకుంటారు కదా. అలా లేదు కనుకే ఈ గోలం అంతా.

ఇంత రాసారు కానీ ఆర్కే ఒక పాయింట్ చెప్పలేదు. అసలు వలంటీర్ వ్యవస్థను వుంచాలా? వద్దా? అన్నది. అది ఒక్కటి క్లారిటీ గా చెప్పేస్తే…ఆర్కే చెప్పిన ‘మాట జారే’ తప్పు ఈసారి ఆర్కే చేసినట్లు అయ్యేది. కానీ పవన్, బాబు, ఆర్కే ఎవరు చెప్పకపోయినా వలంటీర్లకు అయితే క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం మారితే తమ ఉద్యోగాల ఆయుష్షు తీరినట్లే అని. అందువల్ల వాళ్ల జాగ్రత్త వాళ్లు పడతారు. తప్పదు.