ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వెళ్లనున్నారు. రెండేళ్లుగా బీజేపీని ఆయన రోడ్ మ్యాప్ అడుగుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గద్దె దించేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక్కడే పవన్‌తో బీజేపీ విభేదిస్తోంది. ఉమ్మడిగా తామెలా అధికారంలోకి రావాలో ఆలోచించాలని, అందు కోసం ప్రణాళిక అడిగితే అర్థం వుందని బీజేపీ నేతలు అంటున్నారు.
జగన్‌పై ద్వేషం, చంద్రబాబుపై ప్రేమతో రోడ్ మ్యాప్ అడుగుతున్నట్టుగా వుందని బీజేపీ నేతలు నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి ఎలా రావాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించాల్సిన రాజకీయ విధానాలపై కూడా పవన్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం వుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పవన్ కోరుకుంటున్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకపోవడం లాంటివి కేంద్రంగా ఉండవని చెబుతున్నారు. జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాలి, అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరుపై క్లారిటీ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ లేకుండా బీజేపీతో కలిసి వెళ్లేందుకు పవన్‌కల్యాణ్ ఎంత వరకూ సిద్ధంగా వుంటారో ఈ సమావేశం ద్వారా కొంత స్పష్టత వచ్చే అవకాశం వుంది.
ఏపీలో బలపడాలంటే వైసీపీ, టీడీపీలలో ఏదో ఒక పార్టీ దెబ్బతినాల్సి వుంటుందనేది బీజేపీ అభిప్రాయం. టీడీపీ రాజకీయంగా బలహీనపడితేనే తాము బలపడే అవకాశం ఉంటుందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా బీజేపీకి విరుద్ధమైంది. అందుకే టీడీపీని దెబ్బ తీసేందుకే బీజేపీ ఆలోచిస్తుంటుంది. దానికి జనసేనాని ఎంత వరకు అంగీకరిస్తారనేది చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాలో మార్పు రావాలి. లేదంటే ఎన్డీయే భాగస్వామిగా కేవలం సమావేశాలకే పరిమితం అవుతున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి వుంటుంది.