ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సారథిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం వలన, రాష్ట్ర వ్యాప్తంగా ఆమె చురుగ్గా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సమరంలోకి ముందుకు తీసుకువెళ్లడం వలన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చోపచర్చలు చాలానే జరుగుతున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే.. పీసీసీ సారథ్యం తీసుకున్న తర్వాత.. ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల కాసింత నమ్మకం పాదుగొల్పడానికి వైఎస్ షర్మిల చెబుతున్న కొన్ని మాటలు మాత్రం నమ్మశక్యంగా లేవు. అనుమానాలు కలిగిస్తున్నాయి.
తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించినంత కాలమూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే పరితపించి పోయారని షర్మిల అంటున్నారు. తాను కూడా అందుకోసమే పాటుపడతానని చెబుతున్నారు.
ఇదంతా ఓకే.. కాంగ్రెస్ పార్టీలో ఆ మాత్రం స్వామిభక్తి, సోనియా కుటుంబం పట్ల విధేయత ప్రకటించుకోకపోతే మనుగడ కష్టమనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. కాకపోతే.. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కట్టబెట్టే ఫైలు మీదనే పెడతారని షర్మిల అంటున్నారు. ప్రధానిగా తొలి సంతకం ప్రత్యేకహోదా ఫైలుపైనే పెడతానని రాహుల్ తనతో అన్నట్టుగా షర్మిల చెబుతున్నారు.
అయినా.. ఇదే విషయం ఏపీ ప్రజలకు స్వయంగా చెప్పడానికి రాహుల్ కు నోరు లేదా ధైర్యం లేదా అనేది ప్రజల సందేహం. షర్మిలకు మాత్రం ఆయన చెప్పడమూ.. ఆమె ప్రజలకు చెప్పడమూ ఎందుకు అనేది ప్రశ్న. అయినా రాహుల్ ప్రధాని అయితే.. ఎలాంటి మడత పేచీలు లేకుండా హోదా ఇస్తారా అనేది అనుమానం.
సాధారణంగా ఇలాంటి హామీలకు ఎన్నికల తర్వాత పర్యవసానం ఎలా ఉంటుందంటే.. కాంగ్రెసు పార్టీకి సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసేన్ని సీట్లు రాలేదు.. ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశాం గనుక.. అందరి ఒప్పుకోలు అవసరం. వాళ్లు వ్యతిరేకిస్తున్నారు.. అంటుంటారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు ఇవ్వలేదు కాబట్టి.. ఏపీకి హోదా కట్టబెట్టడం గురించి పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి అని అంటారు.
ఇలాంటి మడత పేచీలు ఏమీ లేకుండా.. తాను ప్రధాని అయితే వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని, అందుకు కూటమిలోని అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే తాను ప్రధాని పదవిని స్వీకరిస్తానని స్వయంగా రాహుల్ తో ఒక మాట చెప్పించగల నమ్మకం షర్మిలకు ఉందా అనేది ప్రజల సందేహం.
ఏదో హోదా అనే మాట ఎరగా వేస్తే ఏపీ ప్రజలు నమ్ముతారనే అభిప్రాయం ఆమెకు ఉన్నట్టుగా ఉంది. కానీ విభజన విషయంలో కాంగ్రెసును ఇప్పటికీ ఏపీ ప్రజలు విలన్ గానే చూస్తున్నారు. రాహుల్ తరఫున షర్మిల చెప్పడం కాదు. ఆయన స్వయంగా చెబితేనే ఎంతో కొంత నమ్ముతారు.