వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుండి బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా రాజకీయంగా అనిశ్చితి నెలకొందని.. కార్యకర్తలు అందరూ అయోమయంలో ఉన్నారని.. ఇది పార్టీకి తనకు మంచిది కాదని అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే కృష్ణదేవరాయలు టీడీపీతో టచ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా టీడీపీ నుంచి అదే స్థానంలో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులు ముందు లావు శ్రీష్ణదేవరాయలుకి నరసరావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని జగన్ సూచించడంతో ఆయన నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. ఆ పార్లమెంటర్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకృష్ణదేవరాయలకే అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే తనకు నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తానని లేని పక్షంలో బరి నుంచి తప్పుకుంటానని లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా నరసరావుపేట ఎంపీ కూడా రాజీనామా చేయడం విశేషం. మరికొన్ని రోజుల్లో మరో ఇద్దరు/ముగ్గురు ఎంపీలు కూడా వైసీపీని వీడే అవకాశం ఉందంటున్నారు.