విదేశీ విరాళాలపై కన్నేసిన పవన్ కల్యాణ్!

సాధారణంగా రాజకీయ పార్టీలు మనుగడ కోసం విరాళాలను స్వీకరిస్తూ ఉంటాయి. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీలకు విరాళాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. రాజకీయ ఆలోచన ఉన్నవారు, పార్టీ ప్రాపకం కోరుకునే వారు.. ఇలా రకరకాలుగా…

సాధారణంగా రాజకీయ పార్టీలు మనుగడ కోసం విరాళాలను స్వీకరిస్తూ ఉంటాయి. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీలకు విరాళాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. రాజకీయ ఆలోచన ఉన్నవారు, పార్టీ ప్రాపకం కోరుకునే వారు.. ఇలా రకరకాలుగా ఉంటారు. అలాగే కులాన్ని చూసి విరాళాలు ఇచ్చేవారు కూడా ఉంటారు.

ఏదైతేనేం మొత్తానికి చందాలిచ్చి సహకరించండి అనే మాట డైరక్టుగా అనకుండా జనసేన కూడా అదే పనికి దిగుతోంది. కాకపోతే.. డబ్బుకు సంబంధించిన దందా దగ్గర సొంత మనుషులు ఉండాలి కాబట్టి.. ఈ వ్యవహారం నాగేంద్రబాబు సారథ్యంలో జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్నారైలైతే ముందూ వెనుకా చూసుకోకుండా, చేతికి ఎముకలేకుండా కోట్లలో చందాలు కురిపిస్తారనే నమ్మకంతో ఎక్కువగా అక్కడే ఫోకస్ పెడుతున్నారు నాగబాబు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలు జనసేనకు చాలా కీలకం అని, ప్రవాసాంధ్రులంతా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన టెలికాన్ఫరెన్సులో పిలుపు ఇచ్చారు. ప్రవాసాంధ్రులు ప్రత్యేకంగా ఎన్నికల్లో పార్టీ విజయానికి ఏం కృషి చేస్తారబ్బా అని మీకు డౌటు రావొచ్చు.

పవన్ కల్యాణ్ భావజాలం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలట.. కుదిరితే ఎన్నికల ప్రచారానికి రావాలట.. కుదరకపోతే ఇతర మార్గాల్లో సహకరించాలంట. మొత్తానికి చందాలకు సంబంధించి ఇండైరక్టు పిలుపు ఇచ్చేశారు. త్వరలోనే తాను స్వయంగా యూఎస్ లో పర్యటిస్తానని కూడా నాగబాబు చెప్పడం విశేషం.

కోట్లకొద్దీ నిధులు సేకరించే వ్యవహారం కాబట్టి.. పార్టీ మరొకరిని నమ్మి యూఎస్ పంపడం కూడా కష్టం. అందుకే స్వయంగా పవన్ అన్నయ్యే వెళుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా.. పార్టీకి మద్దతు కోరే పేరుతో తమ కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులతో ఫైవ్ స్టార్ హోటళ్లలో విందు భేటీలు నిర్వహించి.. వారినుంచి విరాళాలు పోగు చేయడం అనేది జనసేనకు అలవాటే. విదేశీ అభిమానుల నుంచి కూడా అప్పుడప్పుడూ విరాళాలు వస్తూనే ఉంటాయి. అయితే.. ఇప్పుడు విరాళాలు సేకరించడం అనేది ప్రత్యేక డ్రైవ్ గా  చేపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయని చెప్పుకుంటున్న జనసైనికులు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టుగా.. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సమయంలోనే.. వీలైనంతగా నిధులు పోగు చేసుకోవాలని.. అందుకే జనసేన గరిష్టంగా నిధుల మీద ఫోకస్ పెడుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.