ఆ సీటు కూడా ద‌క్కించుకోక‌పోతే.. జ‌న‌సేన ఎందుకు?

ఇది ఎన్నిక‌ల స‌మయం. రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ అడుగు జాగ్ర‌త్త‌గా వేయాల్సిన స‌మ‌యం. ముఖ్యంగా పొత్తులో ఉన్న టీడీపీ, జ‌న‌సేన గెలుపే ప్రామాణికంగా సీట్లు, నియోజ‌క వ‌ర్గాల‌ను ఎంచుకోవాలి. ఇది అంత సులువుగా జ‌రిగే…

ఇది ఎన్నిక‌ల స‌మయం. రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ అడుగు జాగ్ర‌త్త‌గా వేయాల్సిన స‌మ‌యం. ముఖ్యంగా పొత్తులో ఉన్న టీడీపీ, జ‌న‌సేన గెలుపే ప్రామాణికంగా సీట్లు, నియోజ‌క వ‌ర్గాల‌ను ఎంచుకోవాలి. ఇది అంత సులువుగా జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన‌లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇంత‌కాలం జ‌న‌సేన‌కు ప‌ట్టుమ‌ని ప‌ది మంది అభ్య‌ర్థులు కూడా పోటీ చేయ‌డానికి లేర‌నే చ‌ర్చ న‌డిచింది.

ఇదే విష‌యాన్ని టీడీపీ కూడా ప‌రోక్షంగా చెబుతూ వ‌చ్చింది. జ‌న‌సేన అభ్య‌ర్థుల్ని కూడా తామే నిల‌బెడుతామ‌ని వ్యంగ్యంగా టీడీపీ నేత‌లు అనేవారు. ఇప్పుడు సీన్ మారింది. ఇంత కాలం ఉభ‌య గోదావరి జిల్లాల్లో మాత్ర‌మే జ‌న‌సేన‌కు నాయ‌కులున్నార‌నే భావ‌న ఉండేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌రో, ఇద్ద‌రో ఆ పార్టీని నాయ‌కులున్నారు. దీనికి కార‌ణం జ‌న‌సేన‌లో చేరితే క‌నీసం టికెట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉండ‌డ‌మే.

ఈ నేప‌థ్యంలో కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌పై టీడీపీ, జ‌న‌సేన టికెట్ త‌మ‌కంటే త‌మ‌కే అని దోబూచులాడుతున్నాయి. ఇలాంటి నియోజ‌క వ‌ర్గాల్లో తిరుప‌తి ప్ర‌ధానమైంది. ఇక్క‌డ బ‌లిజ సామాజిక వ‌ర్గం గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి. జ‌న‌సేన మ‌న పార్టీ అనే ఫీలింగ్ వారిలో వుంది. అయితే పొత్తులో భాగంగా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎవ‌రికి కేటాయిస్తార‌నే స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే అధికార పార్టీ త‌మ అభ్య‌ర్థిగా డిప్యూటీ మేయ‌ర్ భూమ‌న అభిన‌య్ పేరు ఖ‌రారు చేసింది. ఇక తేలాల్సింది ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థే. 2009లో ప్ర‌జారాజ్యం త‌ర‌పున మెగాస్టార్ చిరంజీవి ఇక్క‌డి నుంచే గెలిచి చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టారు. దీంతో జ‌న‌సేన త‌మ‌కే తిరుప‌తి కేటాయించాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. బ‌లిజ‌లు ఎక్కువ ఉన్నార‌ని, త‌మ‌కు టికెట్ ఇస్తే గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఒక‌వేళ టీడీపీకి టికెట్ ఇస్తే, జ‌న‌సేన విజ‌యంపై న‌మ్మ‌కం లేన‌ట్టే అనే సంకేతాలు వెళ్తాయ‌ని, తద్వారా ఓట్ల బ‌దిలీ జ‌ర‌గ‌ద‌ని జ‌న‌సేన వాదిస్తోంది. జ‌న‌సేన‌కు తిరుప‌తి టికెట్ ద‌క్కించుకోక‌పోతే ఇక రాజ‌కీయాలు మానుకోవ‌డం మంచిద‌ని ప‌వ‌న్ అభిమానులు నిష్టూర‌మాడుతున్నారు. జ‌న‌సేన‌కు టికెట్ ఇస్తే, ఎవ‌రిని నిల‌బెట్టినా గెలుచుకుని వ‌స్తామ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాగా చెబుతున్నారు.

జ‌న‌సేన‌ను కాద‌ని టీడీపీకి టికెట్ ఇస్తే మాత్రం, తిరుప‌తిలో గెలుపు గురించి ఆలోచించ‌డం మ‌రిచిపోవ‌చ్చ‌ని ప‌వ‌న్ అభిమానులు హెచ్చ‌రిస్తున్నారు. ఏది ఏమైనా తిరుప‌తి సీటును జ‌న‌సేన‌కు ఇవ్వ‌క‌పోతే, ఇక ఆ పార్టీ రాజ‌కీయాల నుంచి త‌ప్పు కోవ‌డం మంచిద‌నేంత‌గా వారు కామెంట్స్ చేస్తున్నారు.