అన్న ప్రభుత్వం మీద విశాఖలో తొలి నిరసన…!

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక తొలి నిరసన కోసం విశాఖను ఎంచుకున్నారు. విశాఖకు ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారు. ఆయన క్యాడర్ తో భేటీ అవుతారు. అయిదు జిల్లాల…

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక తొలి నిరసన కోసం విశాఖను ఎంచుకున్నారు. విశాఖకు ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారు. ఆయన క్యాడర్ తో భేటీ అవుతారు. అయిదు జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమావేశాన్ని అనంతరం భారీ బహిరంగ సభను భీమిలీలో నిర్వహించనున్నారు. జగన్ విశాఖ షెడ్యూల్ చాలా రోజుల క్రితమే ఖరారు అయింది.

సడెన్ గా షర్మిల విశాఖనే ఎంచుకుని వైసీపీ మీద మొదటి పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆమె విశాఖలోని జీవీఎంసీ ఆఫీసు ఎదురుగా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టే ఆందోళనలో పాల్గొనడం ద్వారా అధికార వైసీపీ ప్రభుత్వానికి అన్నకు బాహాటంగా వ్యతిరేకించే పోరాటానికి తెర తీయనున్నారు.

దీని కోసం షర్మిల సోమవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. ఆమెకు విశాఖ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఒక మాదిరి ఆదరణ అయితే దక్కింది. రియల్ ఫైటర్ షర్మిల అంటూ బ్యానర్లు కట్టి కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. ఒక వైపు వైఎస్సార్ బొమ్మ మరో వైపు షర్మిల బొమ్మతో బ్యానర్లు కట్టి ఆమెకు వెల్ కం చెప్పారు.

షర్మిల వెంట పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఉన్నారు. షర్మిల విశాఖ నుంచే వైసీపీ ప్రభుత్వం మీద సమర శంఖారావాన్ని పూరిస్తుంది అని అంటున్నారు. విశాఖ నుంచి ఆమె 23వ తేదీ నాటికి ఇచ్చాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి ఆమె జిల్లాల పర్యటన మొదలవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు

ఇచ్చాపురం టూ ఇడుపులపాయ పేరిట షర్మిల జిల్లా టూర్లు ఉంటాయని అంటున్నారు. ఇది జగన్ 2017లో చేసిన పాదయాత్రకు రివర్స్ టైటిల్ అన్న మాట. ఆనాడు జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇపుడు షర్మిల కాంగ్రెస్ నేతగా ఇటు నుంచి అటు టూర్లు వేస్తారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ నిరసనలో వైసీపీ ప్రభుత్వం మీద మరింత సౌండ్ పెంచుతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్న మాట.