డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట చేపట్టిన అంగన్వాడీలపై కఠిన చర్యలకు ఏపీ సర్కార్ ఉపక్రమించింది. 40 రోజులుగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. మరోవైపు అంగన్వాడీలు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఎస్మా అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరింత కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటల్లోపు విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
విధుల్లో చేరుతున్న వారిని అనుమతించాలని ఆదేశాల్లో సీఎస్ పేర్కొన్నారు. అలాగే విధుల్లో ఉన్న హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే విజయనగరం, అల్లూరి తదితర జిల్లాల్లో అంగన్వాడీలను తొలగిస్తూ కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇవాళ జగనన్నకు చెబుతాం నినాదంతో చలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపు ఇచ్చారు.
అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించడంలో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ సర్కార్ తాజా ఉత్తర్వులపై అంగన్వాడీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.