ఏపీ కాంగ్రెస్ సారథి వైఎస్ షర్మిలపై సీఎం సొంత జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై షర్మిలను కేవలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాత్రమే చూస్తామన్నారు. ఏపీలో షర్మిల ప్రభావం శూన్యమన్నారు.
నేటి నుంచి షర్మిలను వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా చూడదల్చుకోలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వైఎస్సార్ రక్తానికి నష్టం తెచ్చేలా వ్యవహరిస్తున్నావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన సోనియమ్మ చెంత చేరావని ఆరోపించారు. ఇకపై వైఎస్సార్ బిడ్డగా కంటే, సోనియమ్మ పెంపుడు కూతురిగా చూస్తామని రాచమల్లు సంచలన కామెంట్స్ చేశారు.
షర్మిలను తామూ కొన్ని ప్రశ్నలు అడుగుతామన్నారు. ఏపీలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదని షర్మిల అనడంపై రాచమల్లు ఫైర్ అయ్యారు. అభివృద్ధి కనిపించలేదా? అని ఆయన నిలదీశారు. ఏపీలో పేదరికాన్ని సమూలంగా పారదోలేందుకు ఒక్క రూపాయి కూడా అవినీతి, దళారి వ్యవస్థ, రాజకీయ వివక్ష లేకుండా రూ.2.50 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపిన విధానం మీకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.
పేదలను దగ్గరికి తీసుకున్న వైనం కనిపించలేదా షర్మిలమ్మా అని ప్రశ్నించారు. నాడు-నేడు విధానం కింద రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కనిపించలేదా? అని నిలదీశారు. డ్వాక్రా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడం కనిపించలేదా? అని ప్రశ్నించారు.
ప్రతి గామంలో వెలసిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ కేంద్రాలు, వ్యవసాయ ల్యాబ్‌లు తదితరాలు అభివృద్ధికి ఆనవాళ్లు కాదా? అని ప్రశ్నించారు. మీ దృష్టిలో అభివృద్ధికి నిర్వచనం ఏంటో చెబితే అందరం తెలుసుకుంటామని షర్మిలను ఆయన నిలదీశారు.
తాజాగా ఎవరో వదిలిన బాణం కాదని షర్మిల అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమని మీరు అన్నారంటూ షర్మిలకు గుర్తు చేశారు. బాణం అంత పదునైంది కాదని అన్నారు. అయితే బాణం వదిలే వ్యక్తి లక్ష్యం, చూపు ప్రధానమని ఆయన చెప్పుకొచ్చారు. జగనన్న చేతిలో ఉన్నంత సేపే నువ్వు పదునైన బాణానివి అని ఆయన చురకలంటించారు. జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతిలోకి వెళ్లిన తర్వాత బాణం పదును తగ్గింది, తగ్గుతుందని ఆయన అన్నారు.
లక్ష్యాన్ని ఛేదించలేవని ఆయన అన్నారు. ఎందుకంటే నీ వైపు ధర్మం లేదని షర్మిలపై విమర్శలు చేశారు. అలాగే ప్రజాభిమానం లేదన్నారు. షర్మిలకు స్వార్థం, రాజకీయ కాంక్ష మాత్రమే ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు, సోనియా, రాహుల్‌గాంధీ ఆడుతున్న నాటకంలో కీలు బొమ్మ అయ్యావని షర్మిలపై విరుచుకుపడ్డారు. ఎవరి కోసమో, ఎవరో ఆడించినట్టు ఆడడానికి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చావని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలకు ఏపీలో నామమాత్రంగా కూడా లేని కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఏపీలో జగన్‌ను గద్దె దించడం నీకు సాధ్యమవుతుందా? అని షర్మిలను రాచమల్లు ప్రశ్నించారు. జగన్ పరిపాలనను తప్పు పట్టేంత స్థాయి, అర్హత షర్మిలకు లేవని ఆయన తేల్చి చెప్పారు.