టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా జనంలోకి వెళుతున్నారు. అదేంటో గానీ, యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా పూర్తి చేసిన నారా లోకేశ్ మాత్రం ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. లోకేశ్ కూడా జనంలోకి వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ, ఆచరణకు మాత్రం నోచుకోలేదు.
ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు సమాచారం. బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే బాధ్యతల్ని లోకేశ్ తీసుకున్నారు. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఇప్పటి వరకూ సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ లోకేశ్ అతి జోక్యాన్ని చంద్రబాబు ప్రోత్సహించలేదని తెలుస్తోంది.
టికెట్ కావాల్సినోళ్లంతా లోకేశ్ వెంట తిరుగుతున్నారు. టీడీపీ భవిష్యత్ వారసుడైన లోకేశ్‌ను కీర్తిస్తూ, ఆయన వెంట తిరిగితే చాలు టికెట్ దానికదే వస్తుందనే బ్యాచ్ ఒకటి టీడీపీలో వుంది. ఇలాంటి వాళ్ల సంఖ్య ఎక్కువగా వుందని టీడీపీ పెద్దలు గుర్తించారు. దీంతో ఆదిలోనే చెక్ పెట్టకపోతే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబును అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు వాస్తవాల్ని టీడీపీ పెద్దలు వివరించినట్టు తెలుస్తోంది.
ఐదారు నియోజక వర్గాల్లో మినహాయిస్తే తన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని లోకేశ్ పట్టు పట్టడం లేదు. విజయమే గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబు చేపట్టారని, ఇందులో తాను జోక్యం చేసుకోలేనని లోకేశ్ తెగేసి చెబుతున్నారని తెలిసింది. తాజాగా లోకేశ్ పెద్దగా టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఇన్‌సైడ్ కార్యకలాపాల్లో మునిగి తేలారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర ముగిసిన తర్వాత పలు చానళ్లకు లోకేశ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. చంద్రబాబు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి అవుతారనే లోకేశ్ అభిప్రాయం జనసేనలో మంట రేపింది. ఇదంతా టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేశ్ నడుచుకున్నారు. జనసేన అత్యుత్సాహానికి చెక్ పెట్టి, ఆ తర్వాత చల్లగా లోకేశ్ జారుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల పనిలో లోకేశ్ ఉన్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉనికి చాటుకుంటున్నారు.