ఎంతగా ప్రజాదరణతో మాత్రమే ముడిపడి ఉన్న రంగంగా మనం భావిస్తున్నప్పటికీ.. లేదా, ధనబలం ద్వారా మాత్రమే ఎక్కువగా ఫలితం తేలే వ్యవహారంగా మనం రాజీపడుతున్నప్పటికీ.. ఇవాళ్టి రోజుల్లో రాజకీయం అనేది ఒక అతిపెద్దజూదంగా మారిపోయింది! ఒకసారి ‘జూదం’గా పరిగణించిన తర్వాత ఇక గెలుపోటములు అనేవి ఎవ్వరి చేతుల్లోనూ ఉండవు. కేవలం దైవాధీనాలు!
మరి ఇరుపక్షాలు కూడా చావో రేవో అన్నట్టుగా తలపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ జూదంలో ఎవరు ఓడితే ఏమిటి పరిస్థితి? ఓడిన వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వారి రాజకీయ బతుకు ప్రస్థానం ఎలా సాగబోతోంది? భవిష్యత్ పరిణామాలను లోతుగా, నిష్పాక్షికంగా విశ్లేషించే ప్రయత్నమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?’
రాజకీయం – ఎన్నికలు అంటే మనం సాధారణంగా సమరాంగణంతో, యుద్ధంతో పోలుస్తుంటాం. ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఎవరో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది. రణంలో నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు, వీరోచితమైన దుడుకుతనం, అంగబలం అన్నింటినీ మించి యుద్ధోన్మాదం, విజయదాహం ఫలితాన్ని నిర్దేశిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో వ్యూహాలు, కూహకాలు కుట్రలు కూడా విజేతను నిర్ణయిస్తుంటాయి. జూదం సంగతి చూద్దాం. ఇక్కడ నైపుణ్యాల కంటె ముందుగా మనకు తెలిసి ఉండాల్సినవి కుట్రలు కూహకాలే. తెలివితేటలు కాదు అతితెలివితేటలు ఉండాలి. ఇక్కడ నైపుణ్యాలకు అర్థం కూడా కుట్రలే. ఇప్పుడు చెప్పుకుందాం.. నవతరం రాజకీయాల్ని చూస్తోంటే వాటిని యుద్ధంతో పోల్చాలని అనిపిస్తోందా? జూదంతో పోల్చాలని అనిపిస్తోందా? అవును మరి- రాజకీయం అంటేనే జూదం!
వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జూదమే నడుస్తోంది. ఇక్కడ ప్రధానంగా తలపడుతున్న శక్తులు రెండు- అధికార వైఎస్సార్ కాంగ్రెస్. ప్రతిపక్ష తెలుగుదేశం. మిగిలిన వారు వారికి సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్న వాళ్లు. ఆ ‘సపోర్టింగ్’ అనేది కొందరు నేరుగానూ, కొందరు ఇండైరక్టుగానూ చేస్తున్నారు. ఇరుపక్షాలు కూడా తమ బలాలను నమ్ముకోవడం కంటె.. వ్యూహాలను నమ్ముకుంటున్నాయి. కొందరు కేవలం కుట్రలనే నమ్ముకుంటున్నారు. చరిత్ర ఎరగని కొత్తతరహా కుట్రలు కూడా ఇప్పుడు వాడుకలోకి వస్తున్నాయి.
సరే, ఏదైతేనేం.. మొత్తానికి ఎన్నికలు జరుగుతాయి. ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు! మరొకరికి ఓటమి తప్పదు. ఎవరు గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? అనే చర్చలు సాధారణంగా ఈ సమయంలో ముమ్మరంగా జరుగుతుంటాయి. కానీ ఈ సమయంలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎవరు ఓడిపోతారు? ఓడిపోతే ఏం జరుగుతుంది? అనేది. ప్రధానంగా తలపడుతున్న రెండు పక్షాలలో ఎవరో ఒకరు ఓడిపోవాల్సిందే. ఎవరు ఓడిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయ చిత్రం ఎలాంటి మార్పులు దిద్దుకుంటుంది అని విశ్లేషించే ప్రయత్నమే ఈ కథనం.
జగన్- వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతే..
ముందుగా అధికార పార్టీతోనే ప్రారంభించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎలాగైనా గెలిచి తీరాలనే సంకల్పంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ‘వైనాట్ 175’ అనే అతిశయమైన నినాదాన్ని ఆయన చాలా సీరియస్ గా చెబుతున్నారు. పదేపదే అదే మాట చెప్పడం ద్వారా.. ఆ నినాదాన్ని నిజం చేయాలనే ఆరాటం ఆయనలో కనిపిస్తోందే తప్ప.. తేడా కొడితే ప్రజలు నవ్వుతారనే ఆలోచన ఆయనకు రావడం లేదు.
ఇప్పుడు గెలిస్తే గనుక.. మరో ముప్ఫయ్యేళ్ల పాటు స్థిరంగా ముఖ్యమంత్రి పీఠంపై తానే ఉండగలననే నమ్మకం ఆయనలో ఉంది. అంతటి ప్రజారంజక పాలన అందించగలనని ఆయన విశ్వాసం. అందుకే ఈ సారి విజయాన్ని ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. కొన్ని నెలల కిందట.. మీరందరూ నా జట్టు. మనందరమూ కలిసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి, నెగ్గాలి.. అని ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన నాయకుడు.. ఇప్పుడు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు లేదా వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారు.
నిజం చెప్పాలంటే ఇంత భారీ స్థాయిలో మార్పు చేర్పులు చేయడం అనేది అధికార పార్టీ బలహీనతకు నిదర్శనం. తాను చేపట్టిన సంక్షేమ పథకాల మీద, తనకు ఉన్న ప్రజాదరణ మీద ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు తనను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నారని ఆయన భావన. ఆ నమ్మకంతో ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లిపోయేంత తెగువ ఉండాలి. కానీ.. స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నదనే నివేదికల్ని ఆయన తోసిపుచ్చలేకపోతున్నారు.
మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో మార్పుచేర్పులు అనివార్యంగా మార్చుకున్నారు. పొత్తుల మీద, ఇతరులతో కలిసి ప్రత్యర్థులను ఎదుర్కోవడం మీద కించిత్ నమ్మకం లేని జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఏకైక వ్యూహం ఈ మార్పు చేర్పులే. ఈ మార్పుచేర్పుల వ్యూహం ఫలితమిస్తుందా? బెడిసికొడుతుందా? ఇప్పుడే తేల్చిచెప్పడం కష్టం. బెడిసిందని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఏమవుతుంది?
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలపడుతుంది. వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్ చేయడం అనే నిర్ణయం.. కేవలం జగన్ ప్రజాదరణను దెబ్బకొట్టడానికి, జగన్ రాజకీయ ఎదుగుదలను వ్యూహాత్మకంగా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం. చంద్రబాబునాయుడుకు మేలు చేయాలని, ఆయనను అధికారంలోకి తీసుకురావాలనేది ప్రస్తుతానికి దీని వెనుక ఉన్న కుట్ర, కూహకం.
ఏకపక్షంగా అధికారంలోకి వచ్చి ఉండకపోవచ్చు గానీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సొంత పార్టీని స్థాపించి.. తనదైన ముద్ర చూపిస్తూ దూసుకుపోతున్న వైఎస్ షర్మిలను అక్కడ పూర్తిగా లూప్ లైన్ లో పెట్టేసి, ఆమెను అదునుచూసి ఏపీ రాజకీయాల్లోకి షిఫ్ట్ చేసిన, ఆమె చేతుల్లోనే పార్టీ పగ్గాలు పెట్టిన కాంగ్రెస్ వ్యూహం వెనుక కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఉన్నారు. సదరు శివకుమార్ తో చంద్రబాబునాయుడు ‘యాదృచ్ఛికంగా’ ఎయిర్‌పోర్ట్ లో కలవడం.. అక్కడ ఇద్దరూ పక్కకు వెళ్లి గుసగుసలాడుకోవడం ఇవన్నీ కూడా ఏం సంకేతాలు ఇస్తున్నాయి? జగన్ ను దెబ్బ కొట్టేందుకు.. కాంగ్రెస్ పార్టీ ‘ప్రస్తుతానికి’ చంద్రబాబునాయుడుకు పరోక్షంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది.
సోనియా అహంకారానికి మింగుడుపడకుండా, ధిక్కరించి.. తనదైన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జగన్ పట్ల ఒకరకమైన అక్కసు కాంగ్రెస్ తో ఇలాంటి దిగజారుడు వ్యూహాలను అనుసరింపజేస్తోంది. వారి వ్యూహం ఫలించి జగన్ ఓడిపోతే, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు దక్కేదేమీ ఉండకపోవచ్చు గానీ.. రాబోయే అయిదేళ్లలో వారి పార్టీ బాగా బలపడుతుంది.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం -జనసేన కూటమి అధికారంలోకి వస్తే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. రకరకాల కేసులు బనాయించి.. ఇప్పటి ప్రభుత్వ పెద్దల్లో ఎందరిని వీలైతే అందరిని జైళ్లలోకి నెడతారు. ఆ పార్టీ తరఫున గెలిచిన వారిని కూడా ప్రలోభపెడతారు. ఇప్పుడున్నంత కక్షలు లేని 2014 రోజుల్లోనే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తనలో కలుపుకున్న చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు వదిలిపెడతారని అనుకోవడం భ్రమ.
ప్రలోభపెట్టడం, భయపెట్టడం, బెదిరించడం మార్గం ఏదైనా కావొచ్చు గాక.. గెలిచిన వారిని కూడా ఆ పార్టీలో ఉండనివ్వరు. ఏతావతా.. వైసీపీ మీద గానీ, జగన్ మీద గానీ అభిమానం ఉన్నా సరే.. ఆ పార్టీలో కొనసాగడం చాలా మందికి దుర్లభం అయిపోతుంది. కొందరు తెలుగుదేశం జనసేన వైపు వెళతారు. స్థానిక సమీకరణలు అందుకు ఇబ్బందిగా ఉన్న వారందరూ.. అనివార్యంగా కాంగ్రెసులోకి వెళతారు. ఒక రకంగా చెప్పాలంటే.. వైసీపీలోని నాయకుల్లో చాలా వరకు కాంగ్రెసు మూలాలు ఉన్న వారే. వారికి ఎటూ పార్టీ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది. వైసీపీ దెబ్బతినడం, కాంగ్రెసు బలపడడం జరుగుతుంది గానీ.. కాంగ్రెస్ 2029 నాటికి అధికారంలోకి రాగలిగే స్థాయికి బలపడుతుందా? లేదా మరోసారి (ఆయన ఇప్పుడు కోరుకుంటున్నదే చివరి చాన్స్ అంటున్న వైనం పక్కన పెడితే) చంద్రబాబును సీఎం చేయడానికి ఉపకరిస్తుందా? అనేది స్పష్టత లేదు.
చంద్రబాబు- తెలుగుదేశం ఓడిపోతే…
పేరుకు ఒక కూటమి, పొత్తులు ఇలాంటివి ఎన్నయినా ఉండొచ్చు గానీ.. ఇప్పుడు విపక్షం అంటే చంద్రబాబు మాత్రమే. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక పార్టీలే ఏకం అవుతున్నాయనేది ఇప్పుడు కళ్లెదురుగా ఉన్న వాస్తవం. గత ఎన్నికల్లో బాగా తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ కు అయిదేళ్లలోనే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు దేవుడుగా కనిపిస్తున్నారు. ఆయన అనుభవం, విజ్ఞత రాష్ట్రానికి ఎంతో అవసరం అనే జ్ఞానం పవన్ కు వచ్చింది. అందుకే చంద్రబాబు పల్లకీ మోయడానికి ఎగబడుతున్నారు. తాను మాత్రమే కాదు.. నరేంద్రమోడీతో కూడా చంద్రబాబు పల్లకీ మోయించాలనేది పవన్ కల్యాణ్ కోరిక. అందుకు అనువుగా పావులు కదుపుతున్నారు.
సీట్ల మార్పు చేర్పుల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ప్రస్తుతానికి ఉన్న అస్థిరతను, గందరగోళాన్ని వాడుకుని తాము నెగ్గగలం అని వారు ఆలోచిస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలకపోతే.. విజయం తథ్యం అనే ఆశ వారిని ఊరిస్తోంది. షర్మిల ఫ్యాక్టర్ కూడా వారి ఆశలను పెంచుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే తెలుగుదేశం నెగ్గుతుంది. ఒకవేళ ఓడిపోతే ఏమవుతుంది. చంద్రబాబునాయుడు ప్రజలను ఏమాటలు చెప్పి అభ్యర్థిస్తున్నారో.. అలాంటి చివరి చాన్స్ దక్కకపోతే ఏమవుతుంది? అది ఎవరికి లాభం?
తెలుగుదేశం ఓడిపోవడం అంటే మరోసారి జగన్ అధికారంలోకి రావడమే! జగన్ తాను కోరుకుంటున్నట్టుగా మరో ముప్పయ్యేళ్ల ఏలుబడికి తగిన పునాది వేసుకునే ప్రయత్నాల్లో పడతారు. ప్రతిపక్షాలను మరింతగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. నిజం చెప్పాలంటే, తెలుగుదేశం క్షేత్రస్థాయి బలం అనేది ఒక గాలిబుడగ. 2019లో ఓడిపోగానే కొందరు కీలక నాయకులు ఆ పార్టీని వీడి వెళ్లిపోయారు. చాలా మంది గెలిచిన నాయకులు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. ఆ పార్టీ మీద గానీ, నాయకుడు చంద్రబాబు మీద గానీ వారికి గౌరవం లేదు. కాకపోతే.. వేరే ప్రత్యామ్నాయాలు లేక ఆ పార్టీలో ఉన్నారంతే. అలాంటి వారంతా కూడా ఇప్పుడు ఎన్నికలు గనుక తిరిగి యాక్టివేట్ అవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓడిందంటే గనుక.. గాలిబుడగ వంటి వారి బలం పటాపంచలు అవుతుంది.
ఇన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు.. మరో అయిదేళ్లు అలాంటి దుస్థితిలో మనడానికి ఇష్టపడరు. 70 శాతానికి పైగా తెలుగుదేశం ఖాళీ అవుతుందంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడ ఒక సంగతి ప్రధానంగా గమనించాలి. తెదేపాను వదిలిన వారంతా జగన్ చెంతకు చేరుతారని అనుకోవడం భ్రమ. అనేక సమీకరణాల కారణంగా అలా జరగదు. కానీ.. వాళ్లందరూ తెలుగుదేశాన్ని వదిలి జనసేనలోనో, బిజెపిలోనో చేరుతారు. ఎందుకంటే- జగన్ కు వ్యతిరేకంగా ఉండాలనే భావన, కోరిక వారికి ఉంటుంది. కానీ అందుకు చంద్రబాబునాయుడు సమర్థుడైన నాయకుడు కాదనే నమ్మకానికి వచ్చి ఉంటారు. అందుకే ఆయనను వదిలి ఆయనకు మద్దతిచ్చిన (ఇవ్వాలనుకుంటున్న) పార్టీల్లోకి చేరుతారు. ఎక్కువ లాభం కలిగేది జనసేన- పవన్ కల్యాణ్ కే.
పవన్ కల్యాణ్ ఏ కొంచెం తెలివైన నాయకుడు అయినా ఇలా సమీకరణాలను లోతుగా గమనించాలి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన ఒంటరిగా పోటీచేసి ఉంటే గనుక.. మళ్లీ జగన్ గెలుస్తారేమో గానీ.. జనసేన రాష్ట్రవ్యాప్తంగా భారీగా బలపడేది. ఓటమి తర్వాత తెలుగుదేశం నాయకులు పోటెత్తి జనసేనలోకి వలసలు వచ్చేవాళ్లు.
రాష్ట్రంలో నెంబర్ టూ స్థాయికి, వైసీపీకి ప్రత్యామ్నాయం అనగల స్థాయికి జనసేన చిటికెలో చేరుకునేది. ఈ ఎన్నికల్లో జనసేన రాష్ట్రమంతా పోటీచేస్తే.. పార్టీ ముందుగా బలపడుతుంది. ఓటమి తర్వాత.. తెలుగుదేశం నుంచి వలసలు రాగానే.. ఆ బలం మరింతగా పెరుగుతుంది. ఇది అనివార్యం. కానీ పార్టీని బలోపేతం చేసుకుని, సుస్థిరమైన పార్టీగా మార్చుకునే అవకాశాన్ని పవన్ కాలదన్నుకుంటున్నారు. ఈ పొత్తుల వల్ల ఆయనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏమీ లేదు. పార్టీ గెలిస్తే అధికారంలో భాగం. మంత్రి అనిపించుకోవడం కావొచ్చు గాక. కానీ, ఓడితే ఆ తర్వాతి ఎన్నికలకు ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా సొంతబలం మీద తొడకొట్టగలరు.
మరో కోణంలోంచి చూసినప్పుడు తెలుగుదేశం ఓడిపోతే.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా బలపడుతుంది. ఇప్పుడు వారికి ఒక్కశాతం ఓటుబ్యాంకు కూడా లేదు. ఆ ఓటు బ్యాంకు బాగా పెరుగుతుంది. తర్వాతి ఎన్నికల కాలానికి రాష్ట్రంలో సొంతంగా ఒకటిరెండు ఎంపీ సీట్లు గెలవగల స్థాయికి వెళతారు. ఎటూ మోడీ చంకలోంచి దిగే ఉద్దేశంలేని పవన్ కల్యాణ్ మద్దతు కూడా కంటిన్యూ అయితే.. ఇంకా బాగా బలపడగలరు.
కానీ.. తెలుగుదేశం ఓటమి (జగన్ గెలుపు) వలన కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింటుంది. వైఎస్ షర్మిల సారథ్యాన్ని నమ్ముకుని అటు వెళ్లిన వారిని అధికార పార్టీ అణచివేస్తుంది. అలాంటి వారిలో చాలా మంది రాజకీయాలు చాలించుకోవాల్సి వస్తుంది. వైఎస్ షర్మిల కూడా అనవసరంగా భుజానికెత్తుకున్న భారాన్ని దించేసుకుని తెలంగాణలో చేసిన త్యాగం, ఏపీలో పడిన కష్టానికి ప్రతిఫలంగా రాజ్యసభ ఎంపీ పదవిని పుచ్చుకుని.. ఓసారి ఆ హోదాను అనుభవించి అక్కడితో ప్రస్థానం ముగించాల్సి వస్తుంది.
ఈ రకంగా ప్రధాన పక్షాలలో ఈ రెండు పార్టీలు, ఈ ఇద్దరు నాయకుల ఓటములు.. రాష్ట్ర రాజకీయాలను చిత్రవిచిత్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఈ సంభావ్యతలో ఏది నిజమవుతుందో వేచిచూడాలి.
.. ఎల్ విజయలక్ష్మి