పాముకు కోరల్లో, తేలుకు తోకలో విషం వుంటుంది. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలువెల్లా విషం నింపుకుని ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారని వైసీపీ విమర్శిస్తోంది. కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని షర్మిల స్వకరించిన మొదటి రోజే, తన దుష్టత్వాన్ని ఆమె బయట పెట్టుకున్నారు. షర్మిల మాటకు ముందు, ఆ తర్వాత వైఎస్సార్ పేరు యథేచ్ఛగా వాడుకుంటున్నారు.
వైఎస్సార్ అనే బ్రాండ్ లేకపోతే షర్మిల తలపై రూపాయి పెట్టినా చెల్లుబాటు కాని పరిస్థితి. కారణం తెలియదు కానీ, తన అన్న వైఎస్ జగన్‌పై ఆమె పగతో రగిలిపోతున్నట్టే కనిపిస్తోంది. ఇందుకు ఆమె మాటలే సాక్ష్యం. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడుల గురించి ప్రస్తావిస్తూ, ఒక క్రైస్తవుడిగా ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆమె నిలదీశారు. అసలు మీరు మనుషులేనా? అని ఆమె ప్రశ్నించడం గమనార్హం.
ఈ మాటలు చాలు… షర్మిల ఎజెండా ఏంటో అర్థం చేసుకోడానికి. వైసీపీకి క్రిస్టియర్, ముస్లిం మైనార్టీలు, అలాగే దళితులు, గిరిజనులు మొదటి నుంచి అండగా నిలుస్తున్నాయి. రాబోవు రోజుల్లో కూడా వాళ్లంతా అండగా నిలుస్తారని, తద్వారా జగన్ మరోసారి అధికారంలోకి వస్తారనే ఓర్వలేనితనం షర్మిలను వెంటాడుతోంది. జగన్ ఓటు బ్యాంక్‌ను దెబ్బకొట్టి తద్వారా చంద్రబాబు నాయుడికి రాజకీయ లబ్ధి కలిగించాలనే కాంగ్రెస్ ఎజెండాను నెరవేర్చడానికి షర్మిల తహతహలాడుతున్నారు.
ఇంతకు మించి షర్మిలకు మరో ఎజెండా ఏదీ లేదు. తన అన్నను పదేపదే జగన్‌రెడ్డి అని వెటకారంగా మాట్లాడారు. షర్మిల భాషపై వైసీపీ అభ్యంతరాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు… జగన్‌రెడ్డి గారు అని పిలవడం కూడా తప్పా? అని వ్యంగ్యంగా షర్మిల ప్రశ్నించారు. జగన్‌ను దెబ్బ కొట్టేందుకు శత్రువులతో చేతులు కలిపిన షర్మిల నైజాన్ని గుర్తించలేని అమాయకులెవరూ లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్‌పై ద్వేషంతో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఆమె పాచిక పారలేదు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీనే దిక్కైంది. ఆంధ్రప్రదేశ్‌లో దిక్కూదిశా లేకుండా ఉన్న కాంగ్రెస్‌కు షర్మిల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చీరాగానే ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
దివంగత వైఎస్సార్ బిడ్డగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెల్లిగా తనకు మీడియా ప్రాధాన్యం ఇస్తుందని ఆమెకు తెలుసు. అందులోనూ జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చూపడానికి కెమెరాలు రెడీగా ఉన్నాయి. అయితే షర్మిల బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే వైఎస్సార్ కుటుంబ శత్రువులకు తానెంత విధేయురాలినో చాటుకునే ప్రదర్శన చేశారు. రాజకీయాల్లో అతి ఎప్పటికీ మంచిది కాదు. అన్నతో వ్యక్తిగత విభేదాలను రాజకీయాలకు ముడిపెట్టి, వైఎస్సార్ ఫ్యామిలీ శత్రువుల నుంచి భారీ మొత్తంలో లబ్ధి పొందడానికి షర్మిల ఓవరాక్షన్ చేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.
తెలంగాణలోనే తన చావైనా, బతుకైనా అని డైలాగ్‌లు చెప్పినా అక్కడి ప్రజానీకం నమ్మలేదు. కనీసం ఎన్నికల్లో పాల్గొన కుండానే షర్మిల చాప చుట్టేశారు. ఏపీలో జగన్ పాలకుడు కావడంతో, అక్కడ కొన్ని రోజులు ఆమె హడావుడి నడుస్తుంది. కేఏ పాల్ సంచలన కామెంట్స్‌కు కూడా మీడియా విశేష ప్రాధాన్యం ఇస్తూ వుంటుంది. షర్మిల మరో పాల్ లాంటి నేతే. ఏదైనా సంఖ్యకు కుడి వైపు జీరో వుంటే, దానికి విలువ వస్తుంది.
వైఎస్సార్ అనే బ్రాండ్ ఉండడం వల్లే షర్మిల గురించి మాట్లాడుకుంటున్నారు. అయినంత మాత్రాన జగన్‌ను కాదని, ఆమెకు ఆదరణ దక్కుతుందనుకోవడం అవివేకమే. కొన్నాళ్లు తెలంగాణ, మరికొన్నాళ్లు ఏపీ అంటూ నిలకడలేని రాజకీయాలు చేస్తూ, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడే షర్మిల రాజకీయానికి శాశ్వతంగా ముగింపు పలికే రోజు మరెంతో దూరంలో లేదు.