ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ ఎమ్మెల్యే ఏం మాయ చేశాడో తెలియదు. మొత్తానికి టికెట్ సాధించుకున్నారాయన. సర్వే నివేదికల్లో వ్యతిరేకత వచ్చిందనే కారణంతో దాదాపు పక్కన పెట్టి, మళ్లీ ఆయనకే ప్రకటించడం వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆ చిట్కా ఏదో చెబితే తాము కూడా టికెట్లు దక్కించుకుంటాం కదా అని వైసీపీ ప్రజాప్రతినిధులు అంటున్నారు.
వైసీపీలో అదృష్ట ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే, అతను తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రజాప్రతినిధి కిలివేటి సంజీవయ్య. ఈయన వరుసగా రెండోసారి సూళ్లూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడం మొదలు, సొంత పార్టీ నేతలపై ఆయన స్వారీ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై అక్రమంగా పోలీస్ కేసులు బనాయించడం, చితక్కొట్టించడం యథేచ్ఛగా సాగించారు.
దీంతో కిలివేటి సంజీవయ్యపై సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మెజార్టీ వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. వైసీపీ సర్వే నివేదికలన్నీ ఈయనకు వ్యతిరేకంగా వచ్చాయని సమాచారం. గత కొంత కాలంగా కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు సమావేశాలు నిర్వహిస్తూ, మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే ఓడిస్తామని తేల్చి చెప్పారు. దీంతో సంజీవయ్యను మారుస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది.
ఈ నేపథ్యంలో వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి చావు కబురు చల్లగా చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి సంజీవయ్య పేరు ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సంజీవయ్యకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఈ సందర్భంగా సంజీవయ్య వ్యతిరేకుల పేర్లన్నీ ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట ఎన్నికల ఫలితం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.
అయితే సర్వే నివేదికలు బాగా లేవని చాలా మందిని జగన్ పక్కన పెట్టడం లేక బదిలీలు చేపట్టారు. సూళ్లూరుపేటకు వచ్చే సరికి ఆ పని ఎందుకు చేయలేకపోయారనే చర్చకు తెరలేచింది. వైసీపీ గెలుపు కంటే సంజీవయ్యకు టికెట్ ఇవ్వడానికే మొగ్గు చూపేందుకు ఎవరి ఒత్తిడి పని చేసిందనే చర్చ జరుగుతోంది. ఇంతకూ సంజీవయ్య ఏం మాయ చేశారో చెబితే, తాము కూడా అనుసరించి టికెట్లు దక్కించుకుంటామని బదిలీలైన, అలాగే టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు, ఎంపీలు అడుగుతున్నారు.