ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎలాగైనా గద్దె దింపడానికి చివరి అస్త్రంగా షర్మిలను చంద్రబాబు ప్రయోగిస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలనేవి సర్వసాధారణం. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబ సభ్యురాలైన షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి రాజకీయాలు చేయడం సహజంగానే వైసీపీకి గిట్టదు.
ఇదే సందర్భంలో కాంగ్రెస్ పెద్దలతో పాటు మరి కొందరి మెప్పు కోసం బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే జగన్‌పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు గుప్పించారనే టాక్ వినిపిస్తోంది. జగన్‌తో పాటు చంద్రబాబుపై కూడా షర్మిల ఘాటు ఆరోపణలు చేశారు. బీజేపీ తొత్తుగా చంద్రబాబును అభివర్ణించారు. అలాగే రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానని నమ్మబలికి, చివరికి గ్రాఫిక్స్‌తో సరిపెట్టారని షర్మిల మండిపడ్డారు.
ఏపీని అప్పుల్లో ముంచెత్తిన పాపంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నట్టు విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీ దొందు దొందే అని షర్మిల విరుచుకుపడ్డారు. షర్మిల ఘాటు కామెంట్స్‌పై వైసీపీ నుంచి అదే స్థాయిలో సమాధానం వచ్చింది. అయితే ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా షర్మిల విమర్శలపై స్పందించకపోవడం గమనార్హం. పైగా జగన్‌పై విమర్శల్ని మాత్రం ఎల్లో మీడియా హైలెట్ చేయడం విశేషం.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే… చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అనే విమర్శకు బలంగా కలిగిస్తోంది. షర్మిల వెనుక టీడీపీ లేకపోయి వుంటే ఆమె విమర్శలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రత్యర్థులను ఓడించేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యూహాలు రచించడంలో దిట్ట. అందుకే షర్మిల విమర్శల వెనుక ఆయనున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. చంద్రబాబుతో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే షర్మిల సరికొత్త నాటకానికి తెర తీశారని వైసీపీ విమర్శిస్తోంది.