ఆంధ్రప్రదేశ్ అంటే వేంకటేశ్వరుడు. వారణాసి అంటే విశ్వనాథుడు. తమిళనాడంటే మురుగన్. కర్ణాటక అంటే మంజునాథుడు. మథుర అంటే కృష్ణుడు…ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ భారతదేశంలో ఉన్నవే. భారతీయులంతా కొలిచే దైవాలే.
అయితే కేవలం “భారతదేశం” అంటే మాత్రం ఇకపై మొదటిగా తట్టే దైవం “శ్రీరాముడు”!
రాముడు ఈ జాతికి ఆదిపురుషుడు. ఈ భూమి మీద నడయాడిన ప్రభువు. సీతాన్వేషణలో దేశమంతా పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతాన్ని పునీతం చేసిన మహానుభావుడు.
రామాయణం కావ్యమా, చరిత్రా? ఈ ప్రశ్న పాతదే. సమాధానం మాత్రం ఒక్కటే..రామాయణం అనేది కావ్యరూపంలో ఉన్న ఇతిహాసం. “ఇతిహాసం” అంటే “ఇలా జరిగింది” అని అర్ధం. ఇంగ్లీషులో చెప్పాలంటే “దస్ హ్యాపెండ్” అని. అంటే చరిత్ర అనే కదా!
రామజన్మభూమి అనగానే దశాబ్దాలుగా రాముడికంటే బీజేపీయే గుర్తుకొచ్చేది చాలామందికి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రామజన్మభూమి నినాదాన్ని మతతత్వంగా, ఏంటీ-సెక్యులర్ గా ముద్రవేస్తూ వచ్చింది. కానీ క్రమంగా ఆ నినాదం మెజారిటీ భారతీయుల నరాల్లో ప్రవహించడం మొదలయింది. ఎందుకంటే రాముడు, రామాయణం ఈ జాతి డి.ఎన్.ఏ.
అందుకే అధికశాతం ప్రజలు రాముడిని యావద్భారత హైందవ జాతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసుకున్నారు. అలా మార్చుకునేలా బీజేపీ చేసింది.
రాముడెంతగొప్పవాడో వాల్మీకి రాస్తే తప్ప మన జాతికి అందలేదు. రామభక్తి ఎంత గొప్పదో ఆంజనేయుడిని చూస్తే తప్ప మనకి అర్ధమవ్వలేదు.
“జై శ్రీరాం” నినాదంలో ఎంత చైతన్యం ఉందో, ఎంత ఐకమత్యానికి అది పునాది అవుతుందో, ఈ దేశం యొక్క అస్థిత్వానికి అది ఎంత అవసరమో బీజేపీ నినదిస్తే తప్ప తెలియలేదు. నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో శతాబ్దాల రామమందిర నిర్మాణ స్వప్నం నెరవేరుతుంటే తప్ప ఇందులోని ఐకమత్యస్ఫూర్తి ఎంత పెద్దదో అర్ధం కాలేదు.
ప్రతిపక్షపార్టీలు ఏవైనా సరే ఇప్పుడు వ్యతిరేక ధోరణితో నోరు మెదపకూడని సమయం. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ఏదో అంటేనే సోషల్ మీడియాలో జోకరైపోతున్న సందర్భమిది. దేశమంతా రామమందిర ప్రారంభోత్సవానికి చెందిన భక్తి పారవశ్యంలో, ఒకానొక పూనకంలో ఉంది.
ఈ సెంటిమెంటుని పక్కన పెడితే ఈ రామజన్మభూమి చుట్టూ ప్రగతి, సామరస్యం ఎలా ఉండబోతోందో చూద్దాం.
ముందుగా భక్తిపర్యాటకం. పైన చెప్పుకున్నట్టు తెలుగు నేలపై తిరుమల ఎలాగో దేశానికి అయోధ్య అలా కాబోతోంది.
కనుక కేవలం భారతీయులకనే కాదు, అంతర్జాతీయంగా ఎందరికో ఇది టూరిస్ట్ హబ్ కాబోతోంది. అదొక్కటే కాదు..ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యూర్ వెజిటేరియన్ సెవెన్ స్టార్ హోటల్ అయోధ్యలో రాబోతోంది. ఇది కచ్చితంగా వండరే! సెవెన్ స్టార్ హోటల్ ఏవిటి? ప్యూర్ వెజిటేరియన్ ఏవిటి?
ఇదే వండరనుకుంటే ఇంకా పెద్ద వండర్ ఇంకోకటుంది.
ఇదే అయోధ్యలో రామాలయానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు రాబోతోంది. అది కూడా కేంద్ర బీజేపీ, యూపీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు కలిసి చేస్తున్న పని. ఇది మామూలు విషయం కాదు.
ఒక పక్కన అధికారిక ఇస్లాం దేశ రాజధానియైన అబుధాబీలో అక్కడి షేకుల రాచరిక పాలనలో అతి పెద్ద స్వామీనారాయణ దేవాలయం ఫిబ్రవరిలో ద్వారాలు తెరుస్తోంది. అక్కడే అలా జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఇంకెలా జరగాలి? అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు అయోధ్యలో రాబోతోంది. ఇందులో అతి పెద్ద కురాన్ ని పెడుతున్నారు. పీస్ అండ్ హార్మొనీ సెంటర్ గా దీనిని రూపు దిద్దే పనిలో ఉన్నారు.
మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మసీదులో అన్ని మతాలవారికి ప్రతి రోజు నిత్యాన్నదానం జరుగుతుందట. అంతే కాదు. ఇది హిందువులకి పవిత్రమైన అయోధ్య రామమందిర సమీపంలో కట్టబోతున్న మసీదు కనుక ఆ పవిత్రస్థలంలోని ఆలయాన్ని, ఆ భక్తుల మనోభావలని గౌరవిస్తూ శాశ్వతంగా కేవలం శాకాహార భోజనమే ఆ మసీదులో వండించడం, వితరణ చేయడం జరుగుతుందట..ఇది కదా సామరస్యమంటే! ఇది కదా ఆదర్శమంటే. ముస్లిం మత పెద్దలు ఇంతటి ఆదర్శమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే బీజేపీ ప్రభుత్వం వారి పట్ల ఎటువంటి సానుకూల వైఖరి ప్రదర్శించి మనసులు గెలుచుకుందో అర్ధం చేసుకోవాలి.
అంతే కాదు గతంలో వారణాసి అభివృద్ధిలో కూడా స్థానిక ముస్లిం పెద్దలు ప్రభుత్వానికి ఎంతగానో సహకరించారు.
మరి ఇలాంటి సామరస్యం గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో లేదేం?
అంటే సెక్యులర్ పేరు చెప్పి విద్వేషాలు ఆనాడు!
మతతత్వ పార్టీ అనబడే బీజేపీ పాలనలో సామరస్యం ఈనాడు..!!
నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, నాయకత్వం దేశ అస్థిత్వాన్ని కాపాడుతూనే సెక్యులర్ వాతావరణాన్ని పాడు చేయకుండా, మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా కాపాడుతోంది.
బీజేపీ పుట్టిందే రామజన్మభూమి అంశం మీద, ఎదిగింది బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత…ఇప్పుడు మందిరం కట్టడం అయిపోయింది..కనుక బీజేపీ పెట్టిన కారణం పూర్తైపోయింది అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే.
మరో పార్టీ, మరొక నాయకుడు సాధించలేనివెన్నో మోదీ సాధించి చూపిస్తున్నారు. ప్రపంచ ఆర్ధికపటంలో దేశం ఐదవ స్థానానికి ఎలా చేరింది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉంది? అయోధ్య మందిరం ఎంత ప్రశంతంగా తెరుచుకుంటోంది? ఇలాంటివి ఎన్నో చూసాం, చూస్తున్నాం. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ అమలుపరచడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ ని వెనక్కి తెచ్చుకోవడం, రామరాజ్యమంటే ఇలా ఉంటుంది అని భారతదేశాన్ని ప్రపంచానికి చాటడం..ఇలా చాలా ఉన్నాయి.
ఇలాంటివెన్నో చూడాలంటే నరేంద్ర మోదీ ఆ కుర్చీలో యావజ్జీవితం కూర్చోవాల్సిందే.
ఆ అయోధ్యరాముడు కూర్చోబెట్టాల్సిందే.
పద్మజ అవిర్నేని