ఉత్తరాంధ్ర ఏపీ రాజకీయాలకు ప్రధాన కార్యక్షేత్రం కాబోతోంది. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ కూడా అందుకు దోహదపడుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారిదే ముఖ్యమంత్రి పీఠం. అది చాలా ఎన్నికల్లో రుజువు అయింది. ఉత్తరాంధ్ర ఏపీ రాజకీయాల్లో అధికార తులాబారానికి తులసీదళంగా ఉంది.
అందుకే ఉత్తరాంధ్రనే ప్రధాన రాజకీయ పార్టీలు ఎంచుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర మీదనే మొదటి నుంచి ప్రత్యేక ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రలోనే పరిపాలనా రాజధాని ఉండాలని ఆయన మూడు రాజధానుల ప్రకటన చేసారు. విశాఖను అనధికార రాజధానిగా గుర్తించడమూ వైసీపీ ఏలుబడిలోనే సాగింది.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ నెల 27న తొలి ప్రాంతీయ సమావేశాన్ని జగన్ భీమునిపట్నంలో నిర్వహిస్తున్నారు. అలా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు. ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా ఉత్తరాంధ్ర మీదనే దృష్టి పెట్టారు.
పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఇక మీదట జనంలో ఉంటారని తెలుస్తోంది. ఎన్నికల కోసం ఆమె బస్సు యాత్రను చేపడతారు అని అంటున్నారు. అది కూడా ఉత్తరాంధ్రకు చిట్ట చివరన ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి ప్రారంభించాలని ఆమె భావిస్తున్నారు అని అంటున్నారు.
ఒకనాడు షర్మిల పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగిసింది. మళ్లీ అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున బస్సు యాత్ర మొదలెట్టి ఏపీ మొత్తం ఎన్నికల్లో తిరగాలని ఆ విధంగా కాంగ్రెస్ కి ఉత్తేజం తీసుకుని రావాలని ఆమె చూస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ఆమె బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అవుతుంది అని అంటున్నారు. ఇచ్చాపురం నుంచి ఆమె మొదలెట్టి ఏపీలోని అధిక శాతం నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా టచ్ చేస్తారు అని అంటున్నారు. అటు జగన్ ఇటు షర్మిల ఇద్దరూ ఉత్తరాంధ్రనే రాజకీయ వేదికగా చేసుకునేందుకు రావడం ఏపీ రాజకీయాల్లో హీటెత్తించే పరిణామంగా చూస్తున్నారు.