విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని జిల్లా దాటించి మరీ పోటీ చేయించాలని తెలుగుదేశం అధినాయకత్వం చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. గంటా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పటిదాకా అనేక నియోజకవర్గాలను మారుస్తూ ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు.
ఆయనకు పోటీ చేయడానికి ఇంకా విశాఖలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కానీ వాటిలో చాలా కాలంగా పాతుకుపోయిన కుటుంబాలు లోకల్స్ ఉన్నారు. దాంతో గంటా తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలనే రిపీట్ చేయాల్సి వస్తోంది.
గంటా అయితే బాగా మనసు పడుతోంది పోటీ చేయాలనుకుంటున్నది భీమునిపట్నం, చోడవరం, అనకాపల్లి అని అంటున్నారు. ఈ మూడు చోట్ల గంటా గతంలో పోటీ చేసి గెలిచారు. పైగా మంత్రి కూడా అయ్యారు. అందువల్ల మళ్లీ వీటి మీదనే ఆయన చూపు ఉంది అని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని గంటా ఆశపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిగా కుమారుడిని నిలబెట్టాలన్నది గంటా ప్లాన్ అని అంటున్నారు. అందుకోసం ఈసారి పోటీ చేయబోయే సీటు గంటా ఫ్యామిలీకి పర్మనెంట్ సీటు కావాలని కూడా ముందు చూపుతో ఆయన ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.
అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం గంటాను ఎక్కడ నుంచి పోటీ చేయించాలన్నది మాత్రం ఇప్పటిదాకా తేల్చకుండా టెన్షన్ లో పెడుతోంది అని అంటున్నారు. అంతే కాదు గంటాను విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తారు అని ప్రచారం సాగుతోంది. ఎంపీగా అంటే కనుక గంటాకు రాష్ట్ర రాజకీయాలు జిల్లా రాజకీయాలు కూడా పూర్తిగా దూరం అయినట్లే అని అంటున్నారు.
గత ఎన్నికల్లోనే గంటాను విజయనగరం నుంచి పోటీ చేయించాలని టీడీపీ హై కమాండ్ భావించింది. ఆయన చివరికి విశాఖ నార్త్ సీటుని దక్కించుకున్నారు. విజయనగరం ఎంపీ సీటు నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని పోటీ చేయించాలని మొదట అనుకున్నారు. కానీ ఆయనకు ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు కేటాయిస్తున్నారు.
దాంతో గంటా అయితే సామాజిక వర్గ సమీకరణలు సరిపోతాయని అంగబలం అర్ధ బలం నిండుగా ఉన్న ఆయన వల్ల విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు అన్నది హై కమాండ్ ప్లాన్ అని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త ముఖాలకు మంత్రి పదవులు ఇవ్వాలని కూడా మరో ఆలోచన ఉందని అంటున్నారు. గంటా ఎంపీ పోటీ మీద ఏమంటారో.