డాక్టర్ పాలు తాగమన్నాడు.. రోగి పాలే తాగాలనుకున్నాడు అన్నట్లు అయింది.. ఫ్లాపుల పరంపర కొనసాగిస్తున్న సీనియర్ హీరో రవితేజ నటించిన ఈగిల్ సినిమా వ్యవహారం. పండగ పోటీలో వద్దాం అనుకున్నారు. థియేటర్లు బ్లాక్ చేసుకున్నారు. కానీ ఈ పోటీని తట్టుకోగలమా అని వాళ్లకే అనుమానం కలిగినట్లుంది. అలాంటి టైమ్ లో సంక్రాంతికి ఒకరు వెనక్కు తగ్గాలని ఇండస్ట్రీ పెద్దలు అడిగారు. మొత్తం మీద ఈగిల్ వెనక్కు వెళ్లింది. సోలో డేట్ ఇస్తామని ఇండస్ట్రీ పెద్ద దిల్ రాజు పబ్లిక్ గా హామీ ఇచ్చేసారు.
అయితే అప్పటికే యాత్ర2, భైరవ కోన సినిమాలు డేట్ లు వేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా టిల్లు స్వ్యేర్ రాదు అని కన్ ఫర్మ్ చేసుకునే డేట్ లు వేసుకున్నాయి. టిల్లు స్క్వేర్ వెనక్కు వెళ్తుందని ఆ రెండూ డేట్ లు వేసుకున్నప్పటికే ఇండస్ట్రీ జనాలకు తెలుసు. అయితే దాన్నే త్యాగం కింద మార్చారు. అది వేరే సంగతి.
ఇప్పుడు మొత్తానికి ఈగిల్ కు సోలో డేట్ దొరకడం లేదు. తమకు మాట ఇచ్చిన ప్రకారం సోలో డేట్ ఇవ్వాలన్నది ఈగిల్ నిర్మాతల కోరిక. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఫిబ్రవరి రెండో వారం నాటికి థియేటర్లు అన్నీ ఖాళీ. అప్పటి వరకు వుండే సినిమా ఏదీ లేదు. దాదాపు రెండు వేల స్క్రీన్ లు. ఏం చేసుకోవాలి.
యాత్ర2 సినిమాకు ఎన్ని స్క్రీన్ లు అవసరం పడతాయి. ఆంధ్రలో వున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సినిమా ఎంత మంది చూస్తారు. అన్నింటికి మించి వ్యూహం సినిమాను ఆపినట్లు యాత్ర 2 ను కూడా ఆపుతారేమో అన్న అనుమానం వుండనే వుంది. కాకపోయినా బరిలో మిగిలేవి మూడు సినిమాలు. తలా ఆరు వందల స్క్రీన్ లు..ఏం చేసుకోవాలి. పైగా యాత్ర పొలిటికల్ సినిమా. భైరవకోన హర్రర్ థ్రిల్లర్..ఈగిల్ యాక్షన్ థ్రిల్లర్. అందువల్ల దేనికి అవే.