గుంటూరు కారం సినిమా జానర్ ఇదీ అని స్పెసిఫిక్‌గా చెప్పడానికి టైమ్ సరిపోలేదు అన్నది నిర్మాత నాగవంశీ చెప్పిన పాయింట్. టైమ్ సరిపోలేదు అన్నది కాదు అసలు ఎక్కడ చెప్పారు అన్నది క్వశ్చను. గుంటూరు కారం అని టైటిల్ పెట్టినపుడే త్రివిక్రమ్ జానర్ కు దూరంగా జరిగింది సినిమా. అరవింద సమేత, అల వైకుంఠపురములో టైటిళ్లు వేరు. గుంటూరు కారం టైటిల్ వేరు. అమరావతికి అటు ఇటు అంటే కాస్తయినా ఫ్యామిలీ కళ వుండేదేమో? అలా చేయలేదు.
సరే, ఫస్ట్ లుక్ వదిలారు. అప్పుడేమన్నా ఫ్యామిలీ టచ్ ఇచ్చారా? బీడీ పట్టారు. ఫైట్ పెట్టారు. మరి ఫ్యామిలీ అని చెప్పడానికి అక్కడ టైమ్ సరిపోలేదా? అంటే మాస్ సినిమా అన్న కలర్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. తరువాత పాట వదిలారు… అదీ మాస్ సాంగ్ నే. అక్కడా బీడీనే. లుంగీ కట్టించారు. అంతా మాస్.. మాస్.. ఫ్యామిలీ అనే ఆలోచన ఎక్కడ చేసారు? మీరు?
సరే, కుర్చీ మడతపెట్టి అనే పాట వదిలారు. అది వీర మాస్ కదా? పైగా మహేష్ చేతి సైగలు..అవేంటి మరి? మాస్ నే కదా.. ఫ్యామిలీ టచ్ ఎక్కడ ఇచ్చారు మీరు? ఇలా ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రయిలర్ వరకు అన్నింటా మీరు మాస్ నే నమ్ముకున్నారు. మాస్ నే ప్రొజెక్ట్ చేసారు. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ సినిమా అని చెప్పలేకపోయాము. టైమ్ సరిపోలేదు అంటున్నారు. నిజానికి ఇంకా టైమ్ వున్నా, మరింత మాస్ అనే చెప్పి వుండేవారు. తప్ప ఫ్యామిలీ అని అయితే కాదు.
సరే, అర్థరాత్రి షో వేసారు. మాస్ వచ్చారు. ఫ్యామిలీ సినిమా ఇది అని డిస్సపాయింట్ అయ్యారు. ఫ్యామిలీ అని తెలిసాక, ఫ్యామిలీలు వచ్చాక సినిమా నిలబడింది..ఇది కదా మీ పాయింట్. మరి యుఎస్ లో ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ సినిమా అంటే నెత్తిన పెట్టుకుంటారు. ఫ్యాక్షన్ సినిమా అయినా అరవింద సమేతను ఆదరించారు కదా? మరి గుంటూరు కారం ఎందుకు యుఎస్ వాళ్లకు చేదు అయింది.
అంటే వాళ్లకు ఇంకా ఇది ఫ్యామిలీ సినిమా అని తెలియలేదా? అంటే మీరు మాస్ సినిమా కిందే ప్రొజెక్ట్ చేసారు. కానీ మాస్ జనాలకు ఇందులో మాస్ సరిపోలేదు. త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమాలు తీస్తారు అని జనం అనుకుంటారు. కానీ ఇందులో ఫ్యామిలీ కూడా సరిపోలేదు.
అవును..ఇంతకీ ఎమోషన్ అంటే ఏమిటీ? మహేష్ బాబు కన్నీళ్లు పెట్టుకుని ఏడవాలా? అని అడిగారు.
అత్తారింటికి దారేది సినిమా క్లయిమాక్స్ లో పవన్ కళ్యాణ్ ఏడవలేదు.
అ ఆ సినిమా క్లయిమాక్స్ లో నితిన్ ఏడవలేదు
అరవింద సమేత సినిమాలో తండ్రి చనిపోయిన సీన్ లో ఎన్టీఆర్ భోరుమని ఏడ్చేయలేదు.
ఇలాంటి ఉదాహరణలు ఎమోషన్ కు చెప్పాలంటే త్రివిక్రమ్ సినిమాలు ఇంకా చాలా వున్నాయి. వాటిల్లో అద్భుతంగా పండిన ఎమోషన్లు ఎన్నో వున్నాయి. అక్కడ ఎక్కడా భోరుమని ఏడుపులు లేవు.
కొడుకును తన తండ్రి చంపేస్తాడని తెలిసిన తల్లి పులిలా తిరుగుబాటు చేస్తే జనం శహభాష్ అనేవారు.
కానీ అదే కొడుకును కాపాడుకోవడానికి భర్త ను జైలుకు పంపి, తాను కుటుంబానికి దూరమైపోయి, వేరే వాడిని పెళ్లి చేసుకుని, వేరే వాడికి తల్లిగా మారింది అంటెే జనం హర్షించరు.
బేసిక్ గా అక్కడ వుంది లోపం. అది స్క్రిప్ట్ స్థాయిలోనే గమనించి వుంటే సినిమా ఇలా వుండేది కాదు. అయినా సినిమా ఎక్కడయినా ఆడింది అంటే అది వన్ అండ్ వోన్లీ రీజన్ …మహేష్ బాబు చరిష్మా.