అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌కు తెలుగునాట క్రేజ్ బాగానే వుంది. తల్లి వారసత్వానికి తోడు తరచు వదిలే గ్లామరస్ ఫొటోలు మరింత క్రేజ్ పెంచాయి. ఆమె తొలి తెలుగు సినిమా దేవర. ఈ సినిమా కోసం ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా వున్నారు.
జాన్వీని తెరమీద చూడాలనుకునే వారు ఆసక్తిగా వున్నారు. కానీ ఈ సినిమాలో జాన్వీ పాత్ర జస్ట్ పాటలకే పరిమితమా అన్న అనుమానాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
నిజానికి తెలుగు కమర్షియల్ సినిమా హీరోయిన్ అంటేనే పాటల వరకే పరిమితం. అదేమంత కొత్త విషయం కాదు. అయితే జాన్వీ కపూర్ ను తీసుకున్న తరువాత ఆమెకు తగ్గ పాత్ర వుంటుదని అనుకోవడం కామన్. కానీ జాన్వీ డేట్ లు జస్ట్ ఓ నాలుగు పాటలు చిత్రీకరించడానికి సరిపడే తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా రెండు భాగాలుగా తీస్తుండడం, సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని వార్తలు రావడం, ఇవన్నీ కలిసి ఇక హీరోయిన్ పాత్ర కు ఎంత వరకు స్కోప్ వుంటుంది అన్నది అనుమానం.
ఏమైనా సరే, కొరటాల శివ పాటలు బాగా తీస్తారు. ఆ పాటల్లో హీరోయిన్ ఎలివేషన్ బాగుంటుంది. అందుకోసమైనా, జాన్వీ లుక్ కు తేడా వుండదు అనే గ్యారంటీ అయితే వుంది. సమ్మర్ లో సినిమా వస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది.