ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే వైఎస్ షర్మిల తన మార్క్ విమర్శలతో ప్రత్యర్థులపై చెలరేగిపోయారు. టీడీపీ, వైసీపీ నేతలపై విరుచుకుపడిన షర్మిల, మరో ప్రతిపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్‌పై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం.
ఇటీవల తన కుమారుడు రాజారెడ్డి , ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకకు జనసేనాని పవన్‌కల్యాణ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్‌కు ఆమె ఘన స్వాగతం పలికి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా టీడీపీతో జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తులో ఉన్నారు. బీజేపీతో కూడా తాను పొత్తులో ఉన్నట్టు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవాళ బీజేపీతో అంటకాగుతున్న అన్న వైఎస్ జగన్‌తో పాటు చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేసిన షర్మిల… జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను విస్మరించడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చకు తెరలేచింది. పవన్‌పై ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం ద్వారా, రాజకీయంగా ఆయన ఉనికిని గుర్తించడానికే నిరాకరించినట్టుగా చెబుతున్నారు. పవన్ గురించి ఏం మాట్లాడినా, ఆయన విలువ పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే షర్మిల నడుచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో అధికారికంగా పొత్తులో ఉన్నది పవన్‌కల్యాణే. ఆ విషయం షర్మిలకు తెలియంది కాదు. కానీ పవన్‌కల్యాణ్ ఎప్పుడూ అధికారంలో లేకపోవడం, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన నేతపై మాట్లాడ్డం వృథా అని షర్మిల భావించినట్టున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై మాత్రమే షర్మిల విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.