జనసేనలోకి కాపు నాయకులంతా క్యూ కడుతున్నారు. ఇది మన పార్టీ అనే భావన ఆ సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ నాయకుల్లో వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కులాలు లేని రాజకీయాలను ఊహించుకోవడం కష్టమైన ఈ కాలంలో జనసేనలోకి పవన్ సామాజిక వర్గానికి చెందిన నేతల చేరికను అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో నెల క్రితం వరకూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మనసు మార్చుకున్నారు. జనసేనలో చేరేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. వైసీపీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగినప్పటికీ, అంతిమంగా ఆయన కులం వైపే నిలబడడం గమనార్హం.
కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జనసేనలో చేరతారని ఆ పార్టీ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీలోపు స్వయంగా పవన్‌కల్యాణే తమ సామాజిక వర్గం నాయకుడు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్లి పార్టీలో చేర్చుకుని గౌరవిస్తారని బొలిశెట్టి వెల్లడించారు. దీంతో ముద్రగడపై జనసేన సోషల్ మీడియా గతంలో వైరల్ చేసిన పోస్టులను తొలగించింది.
కాపుల కోసం ముద్రగడ చేసిన పోరాటాల గురించి పాజిటివ్ కథనాలను తెరపైకి తీసుకురావడం గమనార్హం. ముద్రగడ చేరికతో కాపుల ఐక్యత మరింత బలపడుతుందని వాళ్లంతా సంతోషిస్తున్నారు. అయితే తాజా పరిణామాలు గమనిస్తే ముద్రగడ చేరిక ఉన్నట్టా? లేనట్టా? అనే చర్చకు తెరలేచింది. ముద్రగడ మినహాయిస్తే ప్రచారంలో లేని నాయకులు కూడా పవన్‌ను కలుస్తున్నారు. కానీ ముద్రగడ విషయం మరుగున పడినట్టు కనిపిస్తోంది.
ఇవాళ పవన్‌కల్యాణ్ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. సోమవారం ఆయోధ్యలో రామాలయ ప్రారంభ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మళ్లీ ఆయన షెడ్యూల్ ఏంటనేది తెలియడం లేదు. ముద్రగడ చేరికపై జనసేన నేతలు ఒక తేదీ చెప్పడం వల్లే, ఈ అనుమానాలన్నీ. ముద్రగడ చేరికకు మరో శుభ ముహూర్తాన్ని ప్రకటిస్తారేమో చూడాలి.