సానియా మీర్జా, షోయబ్ మాలిక్ అనుబంధంపై చాన్నాళ్లుగా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ అనుమానాల్ని నిజం చేస్తూ, షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లాడిన షోయబ్, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా.
అప్పట్నుంచి సానియా మీర్జాపై వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి. షోయబ్ ను సానియానే వదిలేసిందంటూ పాక్ మీడియా కూడా కథనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ మొత్తం వ్యవహారంపై సానియా మీర్జా తండ్రి స్పందించాడు.
తన కూతురు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ నుంచి నుంచి కొన్ని నెలల కిందట విడాకులు తీసుకుందనే విషయాన్ని ఆమె తండ్రి ఇమ్రాన్ నిర్ధారించాడు. సానియా ఎప్పుడూ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ డొమైన్ కు దూరంగా ఉంచుతుందని, ఈసారి మాత్రం స్పందించక తప్పడం లేదంటూనే, విడాకుల విషయాన్ని బయటపెట్టాడు ఆమె తండ్రి.
సానియా ప్రైవసీకి భంగం కలిగేలా కథనాలు ఇవ్వొద్దని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఇమ్రాన్ కోరాడు. షోయబ్ కు సానియా పెళ్లి శుభాకాంక్షలు కూడా తెలిపిందని అన్నారు.
2010లో మొదటి భార్యకు విడాకులిచ్చాడు షోయబ్, అదే ఏడాది సానియాను పెళ్లాడాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ దుబాయ్ లో కాపురం పెట్టారు. పెళ్లయిన 8 ఏళ్లకు కొడుకు పుట్టాడు. ఇక 2024 చివర్లో సానియాకు విడాకులిచ్చాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో మరో అమ్మాయిని పెళ్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో షోయబ్ ఎప్పుడూ గ్యాప్ ఇవ్వలేదు.