రాజకీయాల్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడం అనేది రొటీనే అనుకోవాలి! ఇప్పుడు పరిటాల కుటుంబం విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. ఆ తాత్వికతను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో అనంతపురం జిల్లాలోనే తమ రాజకీయానికి తిరుగులేదన్నట్టుగా వ్యవహరించింది పరిటాల కుటుంబం. తాము ఏదో ఒక నియోకవర్గానికి పరిమితం కాదని, తాము రాష్ట్ర స్థాయి నాయకత్వం, జిల్లా టీడీపీకి తామే దిక్కున్నట్టుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు పరిటాల కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఏదో ఒక్కటే అనే ఆప్షన్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది!
అవసరం అయినప్పుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి రెండు నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చారు. రాప్తాడుతో పాటు కొన్నాళ్ల కిందట ధర్మవరం బాధ్యతలను కూడా పరిటాల కుటుంబానికి చంద్రబాబు అప్పగించారు. అప్పటికే చాన్నాళ్లుగా ధర్మవరం మీద వారికి ఆశలున్నాయి. ఆ మేరకు ధర్మవరం ఇన్ చార్జి అనగానే.. ఇక ఆ నియోజకవర్గం తమకే అన్నట్టుగా పరిటాల కుటుంబం కూడా ఉత్సాహంగానే వ్యవహరించింది.
అయితే ఇప్పుడు ఒక కుటుంబం, ఒక టికెట్ అనే వాదనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వినిపిస్తున్నారట! తమ కుటుంబానికి తప్ప మరే కుటుంబానికి అయినా ఒకటే టికెట్ అంటున్నారట చంద్రబాబు నాయుడు. ఈ వాదన మేరకు పరిటాల కుటుంబానికి రాప్తాడు లేదా ధర్మవరం ఒకటే టికెట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది!
అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే.. రాప్తాడు విషయంలో చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారనేది! రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు దక్కకపోవచ్చని.. ఆమె స్థానంలో ఒక కొత్త అభ్యర్థిని చంద్రబాబు బరిలోకి దించుతారట! ధనబలంలో గట్టిగా ఉన్న ఒక కొత్త రియలెస్టేట్ వ్యాపారిని రాప్తాడు అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది.
మరి అదే జరిగితే రాప్తాడు టీడీపీ టికెట్ పరిటాల కుటుంబం చేజారినట్టే! అప్పుడు ధర్మవరం ఒక్కటే మిగులుతుంది. అయితే ధర్మవరంలో ఎంతైనా అంత తేలిక కాదు! రాప్తాడు పరిధిలో పరిటాల కుటుంబం మొదటి నుంచి రాజకీయం చేసింది. వారి సొంత ఊరు కూడా రాప్తాడు పరిధిలోనే ఉంటుంది. ధర్మవరం వారికి ఎంతైనా గెస్ట్ అప్పీరియన్సే!
అందునా.. రాప్తాడు రాజకీయం వేరు, ధర్మవరం రాజకీయం వేరు. చాలా వ్యత్యాసం ఉంది, ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పరిటాల ఫ్యామిలీ కూడా ధర్మవరానికి బదులు రాప్తాడునే ఎంచుకోనూ వచ్చు! అయితే ఇప్పుడు రాప్తాడు విషయంలోనే వేరే పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అదే జరిగితే రాప్తాడు టికెట్ చేజారి, ధర్మవరంలో పోరాడాల్సిన పరిస్థితి వస్తే అది పరిటాల ఫ్యామిలీకి గట్టి షాక్ అవుతుంది! కంచుకోట అనుకున్న చోట గత ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు వేరే వాళ్లకు టికెట్ అంటే.. అది శరాఘాతమే అవుతుంది.
ధర్మవరంలో టీడీపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి చేరడానికి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రెడీగా ఉన్నట్టున్నారు. ఒకవేళ టీడీపీ అవకాశం దక్కకపోతే ఆయన బీజేపీ తరఫున నామినేషన్ వేసే అవకాశాలూ లేకపోలేదు. సూరి బరిలో నిలిస్తే సంప్రదాయ టీడీపీ ఓటుబ్యాంకుకు చిల్లు తప్పదు! ఆ పరిస్థితే వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరంలో అలవోగా నెగ్గుతుంది కూడా! మొత్తానికి ధర్మవరం – రాప్తాడు నియోజకవర్గాల వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది.