స్టార్ హోటల్ లో మరో దారుణ హత్య

గోవాలోని ఓ స్టార్ హోటల్ లో తన కన్నకొడుకును ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే, అదే గోవాలో, మరో స్టార్ హోటల్ లో…

గోవాలోని ఓ స్టార్ హోటల్ లో తన కన్నకొడుకును ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే, అదే గోవాలో, మరో స్టార్ హోటల్ లో ఇంకో హత్య జరిగింది. ఈసారి తన భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి. అతడు స్వయంగా ఆ స్టార్ హోటల్ మేనేజర్ కావడం విశేషం.

సౌత్ గోవాలో మ్యారియట్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న ఓ లగ్జరీ హోటల్ లో మేనేజర్ గా చేస్తున్నాడు గౌరవ్ కటియార్. లక్నోకు చెందిన ఈ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన దీక్ష గంగ్వార్ తో పెళ్లయింది.

పెళ్లయిన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనికి కారణం గౌరవ్ కు అక్రమ సంబంధం ఉండడమే. తన అక్రమ సంబంధం గురించి భార్యకు తెలియడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు గౌరవ్.

అనుకున్నదే తడవుగా భార్యను బీచ్ కు తీసుకెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసి, భార్యను సముద్రంలో ముంచేశాడు. భార్యతో బీచ్ కు వెళ్లి ఒంటరిగా తిరిగొచ్చిన గౌరవ్ ను చూసి కొందరికి అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే తన భార్య సముద్రంలో మునిగిపోయిందని అబద్ధం చెప్పాడు గౌరవ్. ఆమె మృతదేహం కోసం పోలీసులు వెదుకుతున్న క్రమంలోనే అసలు నిజం బయటపడింది.

గౌరవ్, తన భార్యను సముద్రంలోకి తీసుకెళ్లడం, ఆమెను అందులో ముంచి హత్య చేయడాన్ని దూరం నుంచి ఓ టూరిస్ట్ వీడియో తీశాడు. ఆ వీడియోను పోలీసులకు అందించాడు. దీంతో గౌరవ్ హత్య మేటర్ బయటకొచ్చింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించడం వల్లనే భార్యను హత్య చేసినట్టు గౌరవ్ అంగీకరించాడు. మంచి ఉద్యోగం చేసుకుంటూ, గౌరవంగా బతకాల్సిన గౌరవ్, ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.