అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారాన్ని చేపడుతుంది! ఏ పార్టీకీ ప్రత్యేకంగా కంచుకోటగా చెప్పలేని శింగనమల రాష్ట్రం మూడ్ ఎలా ఉందో అలా తీర్పును ఇస్తుందనే పేరుంది!
దశాబ్దాల నుంచి శింగనమలలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంది. ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూనే గత ఎన్నికల్లో శింగనమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ రిజర్వడ్ నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారామె. విశేషం ఏమిటంటే.. ఆమె నియోజకవర్గంలో బాగానే తిరుగుతూ వచ్చారు.
సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. 2014లో తొలిసారి జొన్నలగడ్డ పద్మావతి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆమె ఓటమిపాలయ్యారు. రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో వీరు తమ పట్టు పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి. శింగనమల నియోజకవర్గంలో రూరల్ ప్రాంతమే చాలా ఎక్కువ. శింగనమల కూడా ఒక పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. 90 శాతం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు ఉండే నియోజకవర్గం ఇది.
కులాల లెక్కలు చూస్తే రెడ్లు రాజకీయంగా ఆధిపత్యం ఉంటుంది పల్లెల్లో. కమ్మ వాళ్ల జనాభా తక్కువ అయినా.. తెలుగుదేశం వ్యవహారాలను వారే శాసిస్తారు! ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా కమ్మ ఆధిపత్యం ఉంటుంది. ఆ తర్వాత జేసీ ఫ్యామిలీ టీడీపీ ఎంట్రీతో వారి జోక్యం కూడా కొనసాగింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ కుటుంబం చెప్పిన వారికే టికెట్ ఇచ్చారనే పేరుంది. అయితే ఓటమే మిగిలింది.
మరి శింగనమల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు అభ్యర్థో ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేనట్టే! ఆ సంగతలా ఉంటే.. అంత బ్యాలెన్సింగ్ గానే ఉన్నట్టుగా అనిపించిన విషయంలో జగన్ చేసిన మార్పు చర్చనీయాంశంగా మారింది. అటు రెడ్లను ఇటు ఎస్సీ రిజర్వ్డ్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త రాజకీయం సెట్ అయినట్టుగా అనిపించింది. అందులోనూ నియోజకవర్గంలోనే బాగా పని చేసుకుంటూ, పెద్దగా వివాదాలను మూటగట్టుకోకుండానే వారు పని చేశారు. అయినా మార్పు అయితే జరిగినట్టే!
మరి ఈ మార్పుకు కారణం ఏమిటంటే.. జొన్నలగడ్డ పద్మావతి మాల. ఈ నియోజకవర్గంలో మాలల జనాభా ఒక్క శాతం కూడా ఉండదు. మాదిగల జనాభా 30 వేల వరకూ ఉంటుంది. ఆమె మాల కావడం వల్ల మాదిగ ఓట్లు తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా పడుతున్నాయనేది ఒక వాదన. అయితే అయినప్పటికీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 45 వేల స్థాయిలో మెజారిటీ దక్కిన నియోజకవర్గం ఇది! 2014లో జొన్నలగడ్డ పద్మావతి ఓడిపోయినప్పుడు ఈ మాదిగ, మాల వాదన తెరపైకి వచ్చింది. కానీ 2019లో ఆమెకే టికెట్ కేటాయించారు. విజయమూ సాధ్యమైంది. దీంతో ఆ వాదనకు పెద్ద విలువ లేకుండా పోయింది. నియోజకవర్గ స్థాయిలో పని చేసుకోవడంలో పద్మావతి, సాంబశివారెడ్డిలు బాగానే హడావుడిగా కనిపించారు.
తమకు టికెట్ దక్కదనే వార్త తెలిసిన తర్వాతే జొన్నలగడ్డ పద్మావతి కాస్త గట్టిగా మాట్లాడినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత అందుకు రివర్స్ లో కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ఇన్ చార్జిగా వచ్చిన అభ్యర్థి పేరు నియోజకవర్గం స్థాయిలో తొలిసారే వినిపిస్తున్నట్టుగా ఉంది. మరి ఎన్నికలకు ఎంతో సమయం లేని నేపథ్యంలో ఈ మార్పు విషయంలో జగన్ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.
పదేళ్లుగా నియోజకవర్గంలో పని చేసిన వారిని మరిచిపోయేలా చేసి కొత్త అభ్యర్థిని మూడు నెలల్లో పార్టీ మీద, కానీ నియోజకవర్గం మీద రుద్దడం అంటే మాటలేమీ కాదు! జగన్ మిగతా నియోకవర్గాల విషయంలో చేసిన మార్పుచేర్పుల సంగతెలా ఉన్నా, శింగనమల విషయంలో చేసిన మార్పు మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది. మరి అంత ఆశ్చర్యకరమైన మార్పు చేయడానికి అంతర్గత కారణాలు ఏమిటో బయటి వాళ్లకు అయితే అంతుబట్టకపోవచ్చు. మరి ఈ మార్పుతో పద్మావతి- సాంబ ల తదుపరి రాజకీయం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
వయసురీత్యా చూసుకున్నా వీరు పెద్ద వాళ్లు ఏమీ కాదు. మరి ఈ మార్పుకు తట్టుకుని శింగనమలలో కొత్త అభ్యర్థి విజయానికి వీరి సహకారం ఉంటుందా, లేక రెబల్స్ గా తిరుగుబావుటా ఎగరేస్తారా అనేది శేష ప్రశ్న! ఒక దశలో సాంబశివారెడ్డికి అనంతపురం ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన భార్యకు శింగనమల టికెట్టే దక్కేలా లేదు! మరి ఈ మార్పు వారి రాజకీయాన్ని ఎలా మారుస్తుందో!