మరో ఏడాది సంక్రాంతికి తెలుగునాట రొడ్డకొట్టుడు, రాడ్డు సినిమాలే వచ్చాయి. పుచ్చుపట్టిన కథలు, రొటీన్ ఎలివేషన్లు, అరిగిపోయితరిగిపోయిన కథలతోనే తెలుగు మూవీ మేకర్లు మరో సంక్రాంతికి సొమ్ము చేసుకునే యత్నం చేశారు! ఆ సినిమాలకు కూడా వందల కోట్ల వసూళ్లట! అదో విచిత్రం!
సంక్రాంతి సందర్భంగా ఎలాంటి నవ్యత లేని, ఏదోలాగా క్యాష్ చేసుకునే సినిమాలే వచ్చాయి తప్ప, మెచ్చుకోదగ్గ మచ్చుతునకలు రాలేదు! మరి థియేటర్ల విడుదలలు ఇలా సగటు సినిమా ప్రేక్షకుడికి మరోసారి నిరాశనే మిగల్చగా.. ఓటీటీలు మాత్రం మెప్పిస్తున్నాయి! అయితే అక్కడ కూడా తెలుగు సినిమాలు కాదనుకోండి! యథారీతిన మలయాళీలు ఓటీటీల్లో తమ విజృంభణను కొనసాగిస్తూ ఉన్నారు. గత ఏడాది పలు సినిమాలతో ఓటీటీలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టీ హవా కొనసాగింది.
నన్పగల్ నేరదు మయగం, క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, కాదల్-ది కోర్.. ఇవి గత ఏడాది విడుదలైన మమ్ముట్టీ సినిమాలు. 70 యేళ్ల వయసును దాటేసిన ఈ స్టార్ హీరో.. ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలను విడుదల చేయడం ఒక విశేషం అయితే, ఆ నాలుగూ నాలుగు రకాల విభిన్నమైన కథలు, ఆ నాలుగూ ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు కావడం మరో విశేషం.
ఒకదానితో మరోటి అణుమాత్రం సంబంధం లేని నాలుగు వైవిధ్యమైన కథలు ఒకే ఏడాది లో ఒక మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోకి లభించాయంటే, సినిమాను సినిమాగా ఇష్టపడే వారిని అవి ఏ మాత్రం నిరాశ పరచవంటే సినిమాల ఎంపికలో వారి అభిరుచికి, ఆసక్తికి, జడ్జిమెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఆ నాలుగు సినిమాల్లో రెండింట మమ్ముట్టి ఫైట్లు చేశారు, తుపాకీలతో కాల్చారు! అయితే.. ఎక్కడా అతి లేదు. మరో రెండు సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు నభూతో అని చెప్పొచ్చు.
నప్పగల్ నేరదు మయగం ఒక స్ట్రేంజ్ మూవీగా మళ్లీ మళ్లీ చేసేలా చేసింది ఓటీటీలో! అలాంటి కథాంశంతో ఒక స్టార్ హీరో సినిమా చేయడానికి ముందుకు రావడం మలయాళీలు చేసుకున్న అదృష్టం కాబోలు. ఓటీటీ ద్వారా అయినా ఆ సినిమాలు తెలుగు వారు చూడగలుగుతున్నారు. మాస్ ఎంటర్ టైనర్లు చేసినా.. మమ్ముట్టీ ఎంచుకున్న కథాంశాలు గమనించదగినవి. క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్ ఈ రెండు సినిమాలూ హీరోయిజం సినిమాలే! హీరో అనగానే కాలర్ కూడా నలగకుండా నలభై మందిని ఎత్తి కుదేయడమే కాదు కదా! ఆ రెండు సినిమాల్లోనూ తెలుగు హీరోలకు భిన్నమైన హీరోయిజాన్ని చూపించారు!
ఇక అమేజాన్ ప్రైమ్ లో ఇటీవలే విడుదలైన మలయాళీ సినిమా కాదల్- దికోర్ కూడా గత ఏడాదిలో థియేటరికల్ రిలేజ్ పొందిన సినిమానే. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకొచ్చాడంటే..నటుడిగా ఆయన పరిణతికి ఇది నిదర్శనం. నప్పగల్ నేరదు మయగంలో ఒక స్ట్రేంజ్ పాత్రను చేసిన మమ్ముట్టీ కాదల్ లో షేమింగ్ కు గురయ్యే పాత్రను చేయడానికి సందేహించక తను ఎందుకు కంప్లీట్ యాక్టర్ నో చాటుకున్నాడు ఇంకోసారి.
ఒక స్టార్ హీరో అలాంటి పాత్ర చేస్తాడనే ధైర్యం కథ చెప్పే వాడికి కూడా ఉండి ఉండాలి! అలాంటి కథ చెబితే తనను తన్ని తరిమేస్తారు హీరోలు అనే భయమేదీ లేకుండా మమ్ముట్టీకి అలాంటి కథ ఒకటి చెప్పాడు ఆ సినిమా దర్శకుడు. ఆ పాత్ర చేయకపోతే మమ్ముట్టీకి పోయేదేమీ లేదు! అయితే.. ఆ కథను మమ్ముట్టీ చేస్తేనే దానికో విలువ! ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసే వాళ్లో ఆ పాత్రను చేసినా అదో సినిమానే ! అయితే అది అలాంటి వారు చేసి ఉంటే అదో జస్ట్ సినిమా! మమ్ముట్టీ అలాంటి పాత్రను చేయడమే ఆ సినిమాకు ఆయువు పట్టు!
అసలు కథ ఏమిటనేది రివీల్ చేయకుండా, పరిస్థితుల చుట్టూరా ఉన్న పరిణామాలను చూపించుకుంటూ,, ఉల్లిపొరను విప్పినట్టుగా సున్నితమైన కథను చెప్పిన తీరు మలయాళీ మూవీ మేకర్ల సత్తాకుమరో నిదర్శనం అని చెప్పాలి. కథకు చుట్టూరా అల్లిన పరిస్థితులు, కుటుంబం, సమాజం ఆ పరిస్థితులపై స్పందించే తీరే ఆ సినిమా. ఇక క్లైమాక్స్ కూడా నాటకీయంగా కాకుండా, డిప్లొమాటిక్ గా కాకుండా, మమ్ముట్టీ ఇమేజ్ అనే లెక్కలేవీ వేసుకోకుండా.. ఇచ్చిన ముగింపు ఆ దర్శకుడి ధైర్యానికే కాదు, మమ్ముట్టీ ధైర్యానికి కూడా ప్రతీక!
సినిమాలో నలుగురిని కొడితేనో, నాలుగు స్టెప్పులు వేస్తేనో, అండపింబ్రహ్మాండాన్ని రక్షించేస్తేనో.. హీరోయిజం అవుతుందని మన స్టార్ హీరోలు భ్రమల్లో ఉంటారు. ఈ భ్రమల్లో వారి సినిమాలు డిజాస్టర్లు అవుతున్నా.. బయటకు రారు! అయితే తాము నటులం అని, చెప్పే కథే హీరోయిజం తప్ప.. ఆయుధాన్ని పట్టి అడ్డంగా నరుకుతూ పోవడం హీరోయిజం కాదని, కనీసం 70లకు దగ్గరపడ్డ మన స్టార్ హీరోలైనా ఎప్పటికి గ్రహిస్తారో! అన్నట్టు మన స్టార్లు ఆ మలయాళీ సినిమాలు చూడరా!