అదిగో.. ఇదిగో అన్నారు.. సంక్రాంతి అయిన తెల్లారే.. తొలి జాబితా అంటూ హడావుడి చేశారు. అయితే తెలుగుదేశం అభ్యర్థుల జాబితా అతీగతీలేనట్టుగా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వెళ్తోంది. చాలా నియోకవర్గాల్లో మార్పుచేర్పులను ధాటిగా చేస్తోంది. నిర్భయంగా సిట్టింగులను మార్చేస్తోంది.
పాతకొత్త అనే లెక్కలు వేసుకోకుండా.. ఇప్పటికే 50 నియోజకవర్గాల వరకూ అభ్యర్థులను తేల్చేసింది. మార్పుచేర్పులు చేయాలనుకున్న నియోజకవర్గాల వివరాలను ప్రకటించేసి, మిగతా వాటిల్లో సిట్టింగులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగవచ్చనే క్లారిటీ ఇస్తోంది. ఓవరాల్ గా మహా అంటే మరో వారం పది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల విషయంలోనూ పూర్తి స్పష్టతను ఇచ్చేయనూ వచ్చు!
మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ క్లారిటీ ఎప్పటికి? అనేది ప్రశ్నగా మారుతోంది. ఐదేళ్ల కిందటి డేట్ల ప్రకారమే ఈ సారి కూడా ఎన్నికలు అనుకుంటే.. మార్చి 10 నాటికి దాదాపు షెడ్యూల్ రావడం ఖాయం! ఇప్పటికే దాదాపు నెల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన కొనసాగుతోంది. మరి తెలుగుదేశం ఇప్పుడు మొదలుపెట్టినా.. కథ పూర్తవ్వడానికి మరో నెల సమయం పట్టినా పట్టొచ్చు.
అందునా ఆ పార్టీ తరఫున ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకుంటుందా అంటే అలాంటిదేమీ లేనట్టే! పొత్తుల నేపథ్యంలో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. టీడీపీ-జనసేన సీట్ల ఒడంబడిక ఎంత అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకూ! ఒకవేళ ఈ క్లారిటీ చంద్రబాబు- పవన్ ల కు ఉంటే ఉండొచ్చు. కానీ రాజకీయంలో వారిద్దరికే క్లారిటీ ఉంటే సరిపోదు. పార్టీ క్యాడర్ కు ఈ స్పష్టత ముఖ్యం.
తెలుగుదేశం పార్టీలో ఈ విషయంలో గందరగోళం కొనసాగుతోంది. మరి ఈ గందరగోళం నేపథ్యంలో.. చిన్ని చిన్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా కొందరు ఔత్సాహికులు తెలుగుదేశం లిస్టు అనౌన్స్ చేస్తున్నారు. తద్వారా టీడీపీ అభ్యర్థుల వార్తలనూ కాస్త నిలుపుకునేలా చేస్తున్నారు. పచ్చమీడియా కూడా లీకులుగా అభ్యర్థుల పేర్లను రాయడం లేదు. దాని వల్ల లేనిపోని వివాదాలు తలెత్తుతాయనే క్లారిటీతో ఉన్నట్టుంది.
మొత్తానికి పొత్తుల లెక్కలు తేలే వరకూ టీడీపీ అభ్యర్థుల పై స్పష్టత ఉండదని స్పష్టం అవుతోంది. మరి ఇంతకీ పొత్తుల లెక్కల తేలేదెప్పటికి? ఇప్పటి వరకూ టీడీపీ- జనసేన లెక్కలే తేల్లేదు, మరి బీజేపీకి కూడా ఆఫర్ ఉందట, ఆ పార్టీ ఎప్పటికి రావాలి, ఎప్పటికీ లెక్కలు తేలాలో!