ఏపీ కాంగ్రెస్ సారథిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేయగా, జగన్ సర్కార్ రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. మొత్తానికి ఏపీ ప్రజానీకంపై రూ.10 లక్షల కోట్ల భారాన్ని ఇద్దరూ కలిసి మోపారని విమర్శించారు.
ఏపీలో అభివృద్ధి లేనే లేదన్నారు. కనీసం రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేదని తప్పు పట్టారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదని షర్మిల విమర్శించారు. ఇసుక, మద్యం, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ దొందు దొందే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి దాసోహమయ్యాయని విమర్శించారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం తాను అవిశ్వాస తీర్మానం పెడ్తానన్నారన్నారు. తనతో టీడీపీ కలిసి రావాలని జగన్ డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు.
పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి వైసీపీ, టీడీపీలే కారణమని విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఓట్లు వేయకపోయినా, రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు అంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజైనా జగన్రెడ్డి పోరాటం చేశారా? అని షర్మిల నిలదీశారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి వైసీపీ, టీడీపీ తాకట్టు పెట్టాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
నాడు అమరావతి రాజధానిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు నమ్మబలికారన్నారు. త్రీడీలో చూపారని తప్పు పట్టారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులన్నారని ఆమె విమర్శించారు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని విమర్శించారు. బీజేపీకి ఏపీ ఎంపీలు తొత్తులుగా మారారని విమర్శించారు. బీజేపీ చెప్పిందానికల్లా టీడీపీ, వైసీపీ ఎంపీలు గంగిరెద్దుల్లా తలూపుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. బీజేపీకి సహకరిస్తున్న టీడీపీ, వైసీపీలకు ఎందుకు ఓటు వేయాలని ఆమె ప్రశ్నించారు. కావున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె కోరారు.