జనసేనకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పాపానికి ఇదే శిక్ష అన్నట్టు జనసేన సహనంతో టీడీపీ ఆడుకుంటోంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే దాదాపు 60 చోట్ల ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మార్పుచేర్పులను అధికార పార్టీ చేసింది. ఈ నెలాఖరుకు అభ్యర్థులందరినీ ప్రకటించి, ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడీ అవుతున్నారు.
ఎన్నికలకు కనీసం నెలన్నర, రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే, అసంతృప్తులు సర్దుకుంటాయనేది జగన్ వ్యూహం. ఇది నిజం కూడా. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పట్లాగే అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. పొత్తు లేకపోయి వుంటే అది వేరే సంగతి. ఇప్పుడు జనసేనతో పొత్తు వుండడం వల్ల అభ్యర్థులను ముందే ప్రకటించకపోతే నష్టమని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.
సంక్రాంతికి టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల అవుతుందని లీకులు ఇచ్చారు. ఇప్పుడు తూచ్ అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్తో పాటు మొదటి జాబితా విడుదల చేస్తారని చావు కబురు చల్లగా చెప్పడంతో జనసేన అవాక్కవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుందని, అప్పుడు 50 నుంచి 60 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసే అవకాశం వుందని ఎల్లో మీడియా ద్వారా సమాచారం అందించడం గమనార్హం.
అంతకాలం జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారనే విషయాలు చెప్పకపోతే, ఏం చేయాలనే ప్రశ్న ఆ పార్టీ నాయకుల నుంచి వస్తోంది. తమ పార్టీకి సీట్లలో కోత విధించేందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానం జనసేన నేతల్లో వ్యక్తమవుతోంది. అసలు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందో అర్థం కావడం లేదని జనసేన నేతలు వాపోతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని జనసేన నేతలు సందేహిస్తున్నారు. ఇదంతా తమను కట్టడి చేసేందుకేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. సీట్లు, నియోజకవర్గాలు తేల్చకపోతే, జనసేన నేతలు ఇంటికే పరిమితం కావాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, హడావుడిగా సీట్లు, నియోజకవర్గాలు ప్రకటిస్తే, రెండు పార్టీల్లో అసమ్మతి తెరపైకి వస్తే, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదనే వాదన వినిపిస్తోంది.