రా..కదిలిరా పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల ప్రచార సభలే. ఈ సభల్లో టీడీపీ పథకాలపై ప్రచారం నామమాత్రమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడాన్ని గమనించొచ్చు. జగన్‌ను తిట్టడం వల్ల జనం ఓట్లు వేస్తారని చంద్రబాబునాయుడు నమ్ముతున్నట్టున్నారు.
టీడీపీ,జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. ఇరుపార్టీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాయని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంకా ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కొలిక్కి వచ్చినట్టు లేదు. టీడీపీ మాత్రం ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మినీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అయితే ఈ మ్యానిఫెస్టోపై ఎందుకనో చంద్రబాబు ప్రచారం కల్పించడానికి ఇష్టపడుతున్నట్టుగా కనిపించడం లేదు.
బహిరంగ సభల్లో ఎంత సేపూ జగనను తిట్టడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారు. తాను ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు నామమాత్ర ప్రచారం చేయడం గమనార్హం. చంద్రబాబు వైఖరి చూస్తుంటే, ఒకవేళ టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చినా, ఎన్నికల హామీలను అమలు చేసే ఆలోచన లేనట్టుంది. ఆడబిడ్డలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తదితర హామీలను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంక్షేమ పథకాల అమల్లో జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను పేదలకు నేరుగా అందిస్తోంది. చంద్రబాబు ఎన్ని చెప్పినా, జనం నమ్మే పరిస్థితి ఉండదనే మాట వినిపిస్తోంది.
కేవలం జగన్‌పై వ్యతిరేకతతోనే మళ్లీ అధికారం సాధించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే జగన్‌పై విమర్శలు చేసి, మరోసారి అతనే అధికారంలోకి వస్తే ఏమీ మిగల్దనే భయాన్ని సృష్టించడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రయత్నంలో బాబు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.