గులాబీ దళపతికి రేవంత్ సీరియస్ వార్నింగ్!

కేసీఆర్ బాత్రూంలో జారిపడి, తుంటి ఎముక విరిగి, సర్జరీ చేసుకుని చికిత్స పొందుతోంటే.. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించి ఉండవచ్చు గాక.. అంతమాత్రాన రాజకీయ వైరం సమసిపోయిందని అనుకుంటే పొరబాటే! కేసీఆర్ కుటుంబం…

కేసీఆర్ బాత్రూంలో జారిపడి, తుంటి ఎముక విరిగి, సర్జరీ చేసుకుని చికిత్స పొందుతోంటే.. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించి ఉండవచ్చు గాక.. అంతమాత్రాన రాజకీయ వైరం సమసిపోయిందని అనుకుంటే పొరబాటే! కేసీఆర్ కుటుంబం మీద.. నిశిత విమర్శలతో విరుచుకుపడే ఆయన ధోరణిలో మార్పు వచ్చిందని అనుకుంటే పొరబాటే. ఆ విషయాన్ని తాజాగా ఆయన, ఇక్కడ కాదు ఏకంగా లండన్ లోని కాంగ్రెస్ అభిమానుల సాక్షిగా నిరూపించారు.

కేసీఆర్ మీద, తమ ప్రభుత్వంపై వస్తున్న గులాబీ విమర్శల మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో భారాస పార్టీనే కనిపించదంటూ ఆయన జోస్యం చెప్పారు.

సర్జరీ అనంతరం హైదరాబాదులోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్.. యిటీవలే తన ఫాంహౌస్ కు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. యిప్పుడిప్పుడే ఆయన స్టిక్ సాయంతో నడవడం కూడా సాదన చేస్తున్నారు. ఈ వీడియోలను రిలీజ్ చేసిన భారాస నాయకులు.. పులి త్వరలోనే బయటకు వస్తుందని.. కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నట్టుగా చేసిన ప్రకటనలపై రేవంత్ తీవ్రంగానే స్పందించారు.

పులి బయటకు రావడం కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానని అన్న రేవంత్ రెడ్డి.. బయటకు వస్తే దానిని పట్టి బంధించడానికి తమ వద్ద బోను, వల ఉన్నాయని.. ఆ పులిని బంధించి చెట్టుకు వేలాడదీస్తామని .. వంద అడుగుల లోతున గొయ్యి తవ్వి పాతిపెడతానని హెచ్చరించారు.

దావోస్ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. నాలుగైదురోజులుగా రేవంత్ మార్కు విమర్శలకు గ్యాప్ వచ్చింది.లండన్లో కాంగ్రెస్ కార్యకర్తలు తనను అభినందించడానికి సమావేశం ఏర్పాటు చేయగానే.. ఇక రేవంత్ తన సహజశైలిలో రెచ్చిపోయారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా.. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తాం అనే మాటకే కట్టుబడి ఉన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం.. ఆరు గ్యారంటీలకు చావు వార్త మాత్రమే వస్తుందని.. అవి అమలయ్యే అవకాశమే లేదని.. పార్లమెంటు ఎన్నికల తర్వాత అమలు చేసేలా వాయిదా వేస్తారని, అందుకే మాయ చేస్తున్నారని రకరకాల విమర్శలు చేస్తున్నాయి.

అయితే రేవంత్ ప్రభుత్వంపై మరింత ఘాటు విమర్శలు చేయగలిగేలా..కనీసం వందరోజులు ఆగి.. ఆ తర్వాత మాట్లాడదాం అనే విజ్ఞత మాత్రం ఏ ఒక్కరిలోనూ కలగడం లేదు.