విశాఖ జిల్లాలో కూటమి అడుగు ముందుకు పడడంలేదు. సంక్రాంతి పండుగ ముగిసినా టీడీపీ జనసేన కూటమి నుంచి రాజకీయ సందడి అయితే కనిపించడలేదు. ఒక వైపు వైసీపీ తన అభ్యర్ధులంటూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను ప్రకటిస్తోంది.
అలాగే విశాఖ ఎంపీ సీటుకు బీసీ అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని ప్రకటించింది. గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉండగా ఇంచార్జిగా కార్పోరేటర్ ఉరుకూటి చంద్రశేఖర్ ని నియమించింది. తూర్పు నియోజకవర్గానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను తెచ్చి కొత్త ముఖాన్ని జనాలకు పరిచయం చేసింది.
విశాఖ నార్త్ కి కేకే రాజు అభ్యర్ధి అన్నది తెలిసిందే. విశాఖ వెస్ట్ సీటులో ఆడారి ఆనంద్ కుమార్ ని ఇంచార్జిగా చేసింది. విశాఖ సౌత్ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు. ఆయనే ఎమ్మెల్యే అభ్యర్ధి అవుతారా లేదా అన్నది ఇంకా తెలియరావడం లేదు.
భీమునిపట్నం విషయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్ కోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో ఉండబోతున్నారు. మొత్తానికి వైసీపీ దూకుడుగానే ముందుకు వెళ్తోంది. అదే టీడీపీ జనసేన కూటమిలో ఎవరు ఎక్కడ నుంచి అన్నది తెలియడంలేదు.
విశాఖలో టీడీపీ జనసేన కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నాలు అయితే జరగడంలేదు అని అంటున్నారు క్యాడర్ సైతం వైసీపీ దూకుడుని చూసి తమ పార్టీలు అభ్యర్ధులు ఎవరా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ గడచినా ఆ సందడి మాత్రం కనిపించడంలేదు. దాంతో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ స్పీడ్ పెంచాల్సిన విపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కించడం పట్ల ఆయన పార్టీలలో కొంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.