అసమ్మతి ముసుగులో కోవర్టులు!

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల అసమ్మతి గళం వినిపిస్తే చాలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ గళాన్ని చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏ చిన్న అసమ్మతి పెచ్చరిల్లినా సరే.. అది మొత్తానికి పార్టీనే ముంచేస్తుందని జాగ్రత్త…

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల అసమ్మతి గళం వినిపిస్తే చాలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ గళాన్ని చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏ చిన్న అసమ్మతి పెచ్చరిల్లినా సరే.. అది మొత్తానికి పార్టీనే ముంచేస్తుందని జాగ్రత్త పడుతున్నారు. వీలైన చోట్ల అసమ్మతులను బుజ్జగిస్తున్నారు. నాయకుడి మీద వ్యక్తిగత అసంతృప్తి అయితే బుజ్జగించవచ్చు. నాయకుడి పనితీరు పట్ల అసమ్మతి అయితే ఆ అభ్యర్థిని మార్చేయడం గురించి ఆలోచిస్తున్నారు.

ఇప్పటిదాకా పక్కన పెట్టిన అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత కేడర్ నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నవారే. జగన్ తీసుకుంటున్న ఈ చర్యలు మంచివే. కానీ.. అసమ్మతి ముసుగులో తెలుగుదేశం-జనసేన కోవర్టులు పనిచేస్తూ.. మంచి అభ్యర్థులను కూడా పక్కన పెట్టేసేలా కుట్రలు నడుపుతున్నారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అసమ్మతి గళాలు వినిపిస్తే చాలు.. వాటిని సీఎం పట్టించుకుంటారని అందరికీ అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో.. తమకు వీలున్న చోట్ల నియోజకవర్గాల్లో వైసీపీ సెకండ్ కేడర్ లీడర్లను ఎగదోసి.. సిటింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాణి వినిపించేలా విపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయనే అనుమానం కలుగుతోంది.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తోంది. ఆయన తమ్ముడు రాజేంద్రరెడ్డి తాజాగా ఓ ఆడియో సందేశం విడుదల చేస్తూ.. ప్రసన్నకుమార్రెడ్డిని కొనసాగించవద్దు. మార్చేసి కొత్త అభ్యర్థిని పెట్టండి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నదని పేర్కొన్నారు. మండలాల్లో నాయకులు ఎమ్మెల్యే అండతో చెలరేగిపోతూ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు. మళ్లీ గెలుస్తా అనే అహం తన అన్నలో పెరిగిపోయినందువల్ల ఇలా వ్యవహరిస్తున్నారని కూడా అన్నారు. ఇలా అసమ్మతిని బలంగా వినిపించారు.

అయితే ఇలాంటి అసమ్మతి స్వరాలను నమ్మవచ్చా.. ఇలాంటి వాటిని నమ్మి జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చునా? అనేది అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. నిజంగా పార్టీ మేలు కోరే వారే అయితే.. జగన్ విజయాన్ని కాంక్షించే వారే అయితే.. పార్టీలో అంతర్గతంగా పైవారికి తమ అసమ్మతిని తెలియజేస్తారు తప్ప.. ఇలా బహిరంగంగా ఆడియో సందేశాలు విడుదల చేస్తారా? అనేది ఇంకో సందేహం.

ఇప్పుడు ఈ వివాదానికి కారకుడైన తమ్ముడు నల్లపురెడ్డి రాజేంద్రరెడ్డికి భిన్నమైన రాజకీయ చరిత్ర ఉంది. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ రకంగా ఆయనకు పవన్ తో కూడా పరిచయం ఉండే అవకాశం ఉంది. అందువల్ల.. ఇలాంటి ఫేక్ అసమ్మతులను రెచ్చగొట్టి.. తద్వారా జగన్ లో గందరగోళం సృష్టించడానికి, వైసీపీకి ఓటమికి ప్లాన్ చేసేలా.. విపక్షాలు కుట్ర పన్నుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.