ఇంతకూ న్యాయం కోసం ఎవరు పనిచేస్తున్నారు?

ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. పరమార్థం, అంతరార్థం కూడా ఉంటాయి. ఈ సంగతి మనలో చాలా మందికి తెలుసు. అలాగే ప్రతి మాటకు ప్రత్యేకార్థం, అంతరార్థం, నిగూఢార్థం, సంకేతార్థం.. ఇలా రకరకాల అర్థాలుంటాయనే…

ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. పరమార్థం, అంతరార్థం కూడా ఉంటాయి. ఈ సంగతి మనలో చాలా మందికి తెలుసు. అలాగే ప్రతి మాటకు ప్రత్యేకార్థం, అంతరార్థం, నిగూఢార్థం, సంకేతార్థం.. ఇలా రకరకాల అర్థాలుంటాయనే సంగతి.. మాటలే వృత్తిగా గల వారికి మాత్రమే తెలుస్తుంది.

జర్నలిస్టులు రచయితలు ఇలా మాటలో ప్రతి అర్థాన్నీ గమనిస్తూ జాగ్రత్తగా వాడుతారు. వారికంటె ఎక్కువ జాగ్రత్తతో మాటలను వాడాల్సిన వ్యక్తులు న్యాయవాదులు. వాదప్రతివాదాల సమయంలో ప్రతి మాటకు, వాక్యాల్లో పంక్చుయేషన్ మార్కులకు కూడా అర్థాలు మారిపోతాయనే సంగతి వారికి బాగా తెలుసు. అలాంటిది ఎంతో సీనియర్ న్యాయవాది కూడా మాట మీద అదుపులేకుండా మాట్లాడేస్తే ఎలా? అదే మరి తమాషా.

ఏపీ ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాజాగా నెల్లూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు మీద కేసు కొట్టేయడం గురించి సుప్రీంలో ఉన్న కేసు గురించి ఆయన మీడియా వారితో కొన్ని వివరాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు వెల్లడించారు.

చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ప్రభుత్వం జైలులో ఆయన పట్ల చాలా ఉదారంగా వ్యవహరించిందని కూడా అన్నారు. ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు మాట్లాడాలి గనుక.. తాను వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన చంద్రబాబునాయుడు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తో తనను పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూలి కోసం పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగంలోకి తీసుకున్న వారి కోసం నపేను కమిట్మెంట్ తో ప్రాణమిచ్చి పనిచేస్తున్నా.. అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. విమర్శించే వాళ్లు.. లూథ్రా కూలికోసం పనిచేస్తే, పొన్నవోలు జీతం కోసం పనిచేస్తున్నారని అనవచ్చు. కానీ ఇక్కడ సమస్య అది కూడా కాదు. పొన్నవోలు చెప్పినట్టుగా.. ఆయన తనకు ఉద్యోగం ఇచ్చిన వారికోసం కమిట్మెంట్ తో ప్రాణమిచ్చి పనిచేస్తున్నారనే అనుకుందాం. మరైతే ఇరుపక్షాలలో ఇంతకూ న్యాయం కోసం ఎవరు పనిచేస్తున్నారు?

అవినీతికి సంబంధించిన గణాంకాలు, సాక్ష్యాధారాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్ననప్పుడు నిరూపణ అయినప్పుడు.. న్యాయాన్ని రక్షించడానికి తాను పనిచేస్తున్నానని, సిద్ధార్థ లూథ్రా కూలి కోసం చట్టంలోని మెలికలతో మడత పేచీలు పెట్టి కేసులు నడుపుతున్నారని పొన్నవోలు అని ఉంటే చాలా బాగుండేది. ఇరుపక్షాల వారూ తమ తమ క్లయింట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఆయన మాటలు ఉండడంతో.. ఇంతకూ న్యాయం కోసం ధర్మం కోసం ఎవరు పనిచేస్తున్నారనే ప్రశ్న జనం మదిలో మెదలుతోంది.