షర్మిల చాలానాళ్లు తండ్రి చాటు తనయ. తర్వాత అన్న చాటు చెల్లెలు. కొన్నాళ్లు అన్న వదిలిన బాణం. కానీ కాలక్రమంలో రాజన్న బిడ్డగా తనని తాను చాటుకొని, తెలంగాణా కోడలిగా చెప్పుకుని ఒక పార్టీ మొదలుపెట్టి, అనతి కాలంలోనే తన పార్టీని కాంగ్రెసులో కలిపేసి అదే పార్టీ నీడలో ఉన్న రాజకీయ నాయకురాలు.
రాజకీయాలు ఎలాగైనా చేసుకోవచ్చు. ప్రజలు గమనిస్తూ ఉంటారు. వారికి తోచిన తీర్పులు ఇస్తూ ఉంటారు. “ఎప్పటికెయ్యెది ప్రస్తుతం…” అన్నట్టుగా రాజకీయాలు నడిపే నాయకులు, నాయకురాళ్లు ఎందరో ఉన్నారు.
ఇక్కడ షర్మిలని గమనిస్తుంటే పురందేశ్వరి గుర్తుకొస్తోంది. ఆమెతో ఈమె సమాంతరంగా రాజకీయజీవితాన్ని నడుపుతుందా లేక భిన్నమైన మార్గంలో వెళ్తుందా అనేది ఇంకా తెలీదు.
దగ్గుబాటి పూరందేశ్వరి నందమూరివారి ఆడపడుచు. ఆ కుటుంబంలో చక్కగా మాట్లాడగల వక్త. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన కూడా రాజకీయాల్లో ప్రవేశమున్న వ్యక్తే. ఈ దంపతులు చంద్రబాబు రాజకీయ ప్రాబల్యం ముందు నిలబడలేక భంగపడ్డ జంటగానే కనిపిస్తారు రాజకీయ యవనిక మీద.
కానీ వ్యక్తిగత బంధాలకు వచ్చేసరికి ఈ దంపతులు ఎప్పుడూ నారా, నందమూరి కుటుంబాల్ని దూరం చేసుకోలేదు. పైగా తాము కాంగ్రెసులో ఉన్నా, బీజేపీలో ఉన్నా చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న తెదేపాకి పనికొచ్చే పనులే చేస్తూంటారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
మరి ఇప్పుడు షర్మిల అదే బాటలో తాను కాంగ్రెసు నాయకురాలిగా ఉన్నా ఆ పార్టీకి బద్ధ శత్రువైన తన అన్నగారితో సోదరి బంధాన్ని కొనసాగిస్తుందా? లేక రాజకీయ వైరాన్ని, వ్యక్తిగత బంధాల్ని ఒక గాటనే కట్టేస్తుందా? కొన్నాళ్లు ఆగితే తప్ప విషయం తెలియదు.
ప్రస్తుతానికైతే కాంగ్రెసులో ఉంటూ, తెదేపాకి పనికొచ్చే విధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్, తెదేపాలు రహస్య స్నేహితులని బహిరంగ వార్తే చలామణీలో ఉంది.
షర్మిలకి కాంగ్రెసులో రాజకీయ పునరావసం దక్కింది సరే. అసలామె వల్ల తెదేపాకి ఉపయోగమేంటి? చంద్రబాబు ఆలోచన ఏంటి అంటే..ఒకటే! ఆమె కాంగ్రెస్ ఓట్లని గణనీయంగా చీల్చేసి వైకాపాకి దెబ్బకొట్టగలదని నమ్మకం. అయితే ఇది ఎంతవరకు సాధ్యం?
అసలు రాష్ట్రంలో ఉన్న క్రీస్టియన్ ఓట్లు 15-20 లక్షల పైమాటే అని ఒక అంచనా. వీరిలో అధికశాతం ఓటర్లు ప్రస్తుతం వైకాపావైపే ఉన్నారన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు వారిలో కొందరు షర్మిలకి ఓట్లెయ్యాలంటే ఏ కారణంతో వెయ్యాలి?
– జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తులై ఉండాలి
– జగన్ కంటే షర్మిల గొప్ప జనాకర్షణగల నాయకురాలని అనుకోవాలి
– జగన్ పాలనలో కంటే షర్మిల పాలనలో తమకి ఎక్కువ సుఖం దక్కుతుందని భావించాలి
పై మూడింటిలో చివరి రెండింటికీ అసలు చాన్సే లేదు. జగన్ తో పోలిక తర్వాత విషయం…అసలు షర్మిలలో నాయకురాలు అనుకోగలిగే లక్షణం ఇప్పటికి ఒక్కటి కూడా బయటపడలేదు. ప్రజాకర్షణలో ఆమె చాలా వెనకబడి ఉన్నారు.
ఇక పైవాటిల్లో మూడవది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే “పాలన” అనేది సీయం అయితేనే కుదురుతుంది. ఆమె ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత పరిస్థితిలో లేదని ప్రతి ఓటరుకి క్లారిటీ ఉంది.
ఇప్పుడు మొదటి పాయింటుకొద్దాం. ప్రభుత్వవ్యతిరేకత, అసంతృప్తి అనేది ప్రతిచోట ఉంటుంది. అయితే ఆ అసంతృప్తి పరులు తమ ఓటు వెయ్యడానికి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. తమకి ఓకే అయితే ప్రధాన ప్రత్యర్థి పార్టీకి వెస్తారు. ఆ ప్రధాన ప్రత్యర్ధి కూడా నచ్చకపోతే ఓటేయడం మానేస్తారు తప్ప పనిగట్టుకుని వెళ్లి ఎవరో ఒకరికి వెయ్యరు. ఎక్కడా 100% పోలింగ్ నమోదు కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి లేని అభ్యర్థులుకి ఓటేసే వారి సంఖ్య అత్యంత అల్పంగా ఉంటుంది.
ఈ లెక్కలో షర్మిల క్రీస్టియన్ ఓట్లు ఎలా చీలుస్తుంది? ఆమెకు క్రైస్తవుల్లోని ప్రభుత్వవ్యతిరేక ఓట్లు ఎందుకు పడతాయి?
ఇప్పుడామెకి ఓట్లు పడకపోతే రాజకీయ పునరావాసం సరే కానీ, అనవసరపు అప్రతిష్ట మాత్రం మూట కట్టుకోవడం ఖాయం. ఆ ఓటమి తర్వాత అసలామెను చంద్రబాబు ఎంతవరకు పట్టించుకుంటాడు, కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు విలువనిస్తుంది అనేది వేరే విషయం.
షర్మిల ఇంతకీ పూరందేశ్వరిలాగ కుటుంబం ఫస్ట్-రాజకీయం నెక్స్ట్ అనే పద్ధతిలో నెట్టుకొస్తుందా? అలా చేస్తే తెలివైన పనే అనుకోవాలి!
అలా కాకుండా అన్నని దింపి తాను సీయం అవ్వాలనే దిశలో ఆలోచిస్తుందా? ఇలా చేస్తే మాత్రం అతితెలివే అనుకోవాలి.
ఆమెలో తెలివుందా లేక అతితెలివుందా అనేది కాలమే చెప్పాలి.
ప్రస్తుతానికి షర్మిలని ఒక రాజకీయ పావులాగ వాడుతోంది తెదేపా నాయకత్వం. రానున్న కాలంలో ఈ పావు ఎవరికి పాములా మారుతుందో చూడాలి.
శ్రీనివాసమూర్తి