Advertisement

Advertisement


Home > Politics - Telangana

మళ్ళీ గులాబీ పార్టీ ప్రాంతీయవాద అస్త్రం

మళ్ళీ గులాబీ పార్టీ ప్రాంతీయవాద అస్త్రం

పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి గులాబీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతోంది. అదే పనిగా నాన్ స్టాప్ గా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని గగ్గోలు పెడుతోంది. కేసీఆర్ కష్టపడి చేసిన అభివృద్ధి అంతా మూసీలో కలిసిపోయిందని పెడబొబ్బలు పెడుతోంది.

తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అన్న సామెత మాదిరిగా కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్న విమర్శలకు ఘాటుగా, దీటుగా సమాధానమిస్తున్నాడు. అవసరాన్నిబట్టి బూతులు కూడా లంకించుకుంటున్నాడు. నిన్న ప్రచారంలో కేసీఆర్ ను ఉద్దేశించి సన్నసోడా, సోయిలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా అని చెలరేగిపోయాడు. ఎవరికెవరూ తీసిపోవడంలేదు. 

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓవరాక్షన్ చేస్తుండటంతో  రేవంత్ రెడ్డికి కూడా తప్పడం లేదనిపిస్తోంది. రాజకీయాల్లో ముతకగా వ్యవహరిస్తే తప్ప మనుగడ సాగించడం కష్టం. రేవంత్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని గులాబీ పార్టీ నేతలు మళ్ళీ ప్రాంతీయవాదం అస్త్రాన్ని బయటకు తీశారు. కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయవాదంతో జనాలను రెచ్చగొట్టే పని చేస్తూనే ఉన్నారు.

ప్రజలకు తన మీద సానుభూతి కలగాలనే ఉద్దేశంతో కావొచ్చు ప్రతిచోటా తాను చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చానని చెబుతుంటాడు. తెలంగాణ సాధన తన ఒక్కడి వల్లనే సాధ్యమైందని చెప్పుకోవడం ఆయన అలవాటు. దీనికి పొడిగింపుగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మరింత ముందుకెళ్లి రేవంత్ రెడ్డికి ఆంధ్ర మూలాలు ఉన్నాయని ప్రచారంలో  చెప్పాడు. 

అంటే ఆయన ప్యూర్ తెలంగాణ వాడు కాదని చెప్పడమన్న మాట. ఆంధరావాడు తెలంగాణకు సీఎం అయ్యాడని అందులో అర్థం. కేసీఆర్ ఒక్కడే అచ్చమైన తెలంగాణ వాడన్నమాట. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తరువాత కొందరు కేసీఆర్ ఆంధ్రవాడని ప్రచారం చేశారు. ఆయన పూర్వికులు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందినవాళ్ళని, అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారని చెప్పారు.

అప్పట్లో కొందరు ఆంధ్ర నాయకులు విజయనగరం జిల్లాకు వెళ్లి పరిశోధన చేశారు. ఇప్పటికీ కేసీఆర్ బంధువులెవరో అక్కడ ఉన్నారని, వాళ్ళు కూడా కేసీఆర్ పూర్వికులు ఇక్కడి నుంచే తెలంగాణకు వెళ్లారని చెప్పారని అప్పట్లో బాగా ప్రచారం చేశారు. అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పూర్వికులది బీహార్ రాష్ట్రమని, అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చారని అనేకసార్లు చెప్పాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కూడా ఈ మాట అన్నాడు. 

ఆయన బీహార్ వాడు కాబట్టే ప్రభుత్వంలో ఎక్కువమంది ఉన్నతాధికారులు బీహార్ వాళ్ళు ఉన్నారని అన్నాడు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్ కుమార్ బీహార్ వాడే. కేసీఆర్ కు బాగా సన్నిహితుడు. కేసీఆర్ అధికారం పోయాక ఆయన పాలనలో జరిగిన అక్రమాలు బయటకు వచ్చినప్పుడు సోమేశ్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. అక్రమాల పుట్ట అని చెప్పుకుంటున్న, భూములకు సంబంధించిన ధరణి సోమేశ్ కుమార్ రూపకల్పనే. 

ఆయన కూడా  భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. సరే ...సివిల్ సర్వీస్ అధికారులు కొందరు బీహారీలు ఉన్నంత మాత్రాన కేసీఆర్ బీహార్ వాడని చెప్పలేం. వలసలు లేకుండా మానవ ప్రస్ధానం ఉండదు. రేవంత్ రెడ్డికి ఆంధ్ర మూలాలు ఉన్నాయని హరీష్ రావు అన్నాడుగానీ లోతుల్లోకి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి తెలంగాణకు వచ్చారో చెప్పలేదు. ఇదంతా ప్రజలను రెచ్చగొట్టాడానికేనని అర్థమవుతోంది. అయినా ఇప్పుడు ప్రాంతీయ వాదంతో ఊగిపోయేవారెవరూ లేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?