దేశవ్యాప్తంగా కుక్కలు ఎంత ప్రమాదకరంగా మారాయో అందరం చూస్తూనే ఉన్నాం. నిర్మానుష్య ప్రాంతంలో ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నాపెద్ద తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. పెద్దోళ్లు గాయాలతో బయటపడుతుంటే, కొంతమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడీ బెడద సెలబ్రిటీలకు కూడా తప్పలేదు.
సాధారణంగా సెలబ్రిటీలు బయట తిరగరు. కార్లలో తిరుగుతుంటారు, చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుంటారు. అయినప్పటికీ ఓ కుక్క, కియరా అద్వానీని ముప్పుతిప్పలు పెట్టింది. ఓవైపు సెక్యూరిటీ సిబ్బంది, మరోవైపు మీడియా ఉన్నప్పటికీ.. కియరాను దాదాపు వెంబడించింది.
ముంబయి ఎయిర్ పోర్టులో అప్పుడే కారు దిగింది కియరా అద్వానీ. ఆమె కోసం అల్లంత దూరంలో మీడియా ఫొటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు. నవ్వులు చిందిస్తూ వాళ్ల వైపు నడుచుకుంటూ వస్తోంది కియరా. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ కుక్క, ఒక్కసారిగా కియరా వైపు దూకింది.
దీంతో కాసేపు బిత్తరపోయింది కియరా. కుక్క దాదాపు కియరాకు అడుగు దూరంలోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కుక్కను తరిమేశారు. అయితే అంతకంటే ముందే మీడియా వాళ్ల హడావుడి చూసి కుక్క పారిపోయింది. ఇలా కుక్క దాడి నుంచి అడుగు దూరంలో తప్పించుకుంది కియరా అద్వానీ. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.