వైసీపీ అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాతే, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగో జాబితా వెలువరించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే మూడు జాబితాలు వెల్లడించి, 59 స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో మార్పు, చేర్పులు చేపడితే, అసంతృప్తులు సర్దుకుంటున్నాయని జగన్ భావన. ఈ నెల 25 నుంచి జగన్ జనంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొట్టమొదట కేడర్‌ను సమరానికి సమాయత్తం చేయడానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో మొదట పర్యటించనున్నారు.
భీమిలిలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీ శ్రేణులకి దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించనున్నారు. జగన్ ఒక్కడూ ఒకవైపు, మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్నట్టుగా ఏపీలో రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే వైసీపీ కేడర్ క్రియాశీలకంగా పని చేయాలి. గత నాలుగున్నరేళ్లలో వైసీపీ పాలన కేడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
వైసీపీ కేడర్‌లో అసంతృప్తిని పోగొట్టి, ఉత్సాహం నింపాల్సి వుంది. అది చేసినప్పుడే ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని అధికార పార్టీ తలపడే పరిస్థితి. వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తిని గ్రహించే జగన్ మొట్టమొదట వారితో సన్నాహక సమావేశాన్ని నిర్వహించ తలపెట్టారు. ఆ తర్వాత కోస్తా, రాయలసీమలలో కేడర్‌తో సమావేశమై, అనంతరం జనంలోకి వెళ్లనున్నారని సమాచారం.