ఎల‌క్టోర‌ల్ బాండ్ల ప‌థకంపై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

రాజ‌కీయ విరాళాల్లో పారద‌ర్శ‌క‌త కోస‌మంటూ మోదీ స‌ర్కార్ 2018లో తీసుకొచ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల ప‌థ‌కంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ స్కీమ్ ముమ్మాటికీ చ‌ట్ట విరుద్ధ‌మ‌ని సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు…

రాజ‌కీయ విరాళాల్లో పారద‌ర్శ‌క‌త కోస‌మంటూ మోదీ స‌ర్కార్ 2018లో తీసుకొచ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల ప‌థ‌కంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ స్కీమ్ ముమ్మాటికీ చ‌ట్ట విరుద్ధ‌మ‌ని సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన బెంచ్ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రాజ్యాంగ విరుద్ధ‌మైన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌ని వెంట‌నే నిలిపివేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఇది కేంద్ర స‌ర్కార్‌కు గ‌ట్టి షాక్ అని చెప్పొచ్చు.

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌ను స‌వాల్ చేస్తూ కాంగ్రెస్‌, సీపీఎం, ఎన్జీవో అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రీఫార్మ్స్ (ఎడీఆర్‌) సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. వేర్వేరుగా దాఖ‌లైన నాలుగు పిటిష‌న్ల‌పై గ‌త ఏడాది అక్టోబ‌ర్ 31న సర్వోన్న‌త న్యాయ‌స్థానంలో వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇరువైపు వాద‌న‌లు విన్న చీఫ్ జ‌స్టిస్‌తో కూడిన బెంచ్‌… తీర్పును నవంబ‌ర్ 2న రిజ‌ర్వ్ చేసింది. ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌రించింది.  

బ్లాక్ మ‌నీని అరిక‌ట్ట‌డానికి ఎల‌క్టోర‌ల్ బాండ్లు ఒక్కటే స‌రైంది కాద‌ని స‌ర్వోన్న‌త న్యాయ స్థానం పేర్కొంది. ఈ బాండ్ల‌ను విక్ర‌యించ‌రాద‌ని తీర్పులో స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చింది. క్విడ్ ప్రోకోకు ఈ బాండ్ల తెర‌తీస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు, పౌరుల స‌మాచార హ‌క్కును ఈ స్కీమ్ ఉల్లంఘిస్తోంద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  

రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు ఎవ‌రిచ్చారో తెలియాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. 2019 నుంచి జారీ చేసిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వివ‌రాలు వెల్ల‌డించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్‌, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పెట్టాల‌ని ఆదేశించ‌డంతో రాజ‌కీయ పార్టీలు షాక్ తిన్నాయి.