అనర్హత పిటిషన్‌పై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ చీఫ్ విప్ ప్రసాద్‌రాజు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని సదరు పార్టీ నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటు, అటు నలుగురిపై అనర్హత కత్తి వేలాడుతోంది.
ఇప్పటికే ఒకట్రెండు సార్లు స్పీకర్ విచారణకు రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమపై మోపిన అభియోగాల్లో నిజం లేదని రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట వివరించారు. అయితే ఎక్కువ సార్లు వైసీపీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. ఏం చేస్తారో చేసుకోనివ్వండి అనే రీతిలో వాళ్ల వైఖరి వుంది.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి స్పీకర్ ఎదుట విచారణకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. విచారణకు హాజరు కాలేమంటూ స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖలు రాశారు.
తమకు వ్యతిరేకంగా చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం చెల్లవని లేఖల్లో వారు ప్రస్తావించారు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ అని ఆయా సంస్థలు నుంచి సర్టిఫై కాపీలను తెప్పించాలని స్పీకర్‌ను కోరారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.